
- క్రాకర్స్ కొనుగోళ్లలో నగరవాసుల వైవిధ్యం
- ఫ్యాన్సీ, బ్రాండెడ్ పటాకులకే ఎక్కువ డిమాండ్
- మోతెక్కించిన లక్ష్మి బాంబులు
- వెలుగులు వెదజల్లిన డబుల్షాట్ రాకెట్లు
- ప్రమాదాల్లో 73 మందికి గాయాలు
- సరోజినిలో ముగ్గురికి కంటి ఆపరేషన్
దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. పటాకుల మోతతో సిటీ దద్దరిల్లింది. చిన్నాపెద్దా అంతా వేడుకల్లో పాల్గొన్నారు. పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చే లక్ష్మి బాంబులతోపాటు డబుల్ షాట్స్ వంటివి పేల్చి పరిసరాలను మోతెక్కించారు. ఆకాశంలోకి దూసుకెళ్లిన రాకెట్లు చీకట్లు పారదోలి పరిసరాలను కాంతిమంతం చేశాయి. చిన్నారులు, మహిళలు కాకరపువ్వొత్తులు వెలిగించి సంతోషపడ్డారు. మొత్తంగా సిటీలో ఈ సారి రూ. 120 కోట్ల పటాకులు అమ్ముడుపోయినట్టు వ్యాపార వర్గాలు తెలిపాయి. గతం కంటే శబ్దకాలుష్యం తగ్గిందని పీసీబీ అధికారులు వెల్లడించారు. పటాకులు కాలుస్తూ గాయపడ్డ వారు సరోజినిదేవి, ఉస్మానియా హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. ఆది, సోమవారాల్లో 73 మంది చికిత్స కోసం వచ్చారు. వీరిలో కొందరికి తీవ్రగాయాలయ్యాయి. ముగ్గురికి ఆపరేషన్ చేస్తే కానీ కంటి చూపు వచ్చే పరిస్థితి లేదని డాక్టర్లు చెప్పారు.
హైదరాబాద్, వెలుగు:
పటాకుల మోతలు, రాకెట్ల మిరుమిట్లు.. బొమ్మలకొలువులు, ప్రత్యేక పూజలతో సిటీలో దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. పండగ కోసం గ్రేటర్‌లో సుమారు రూ. 120 కోట్ల వ్యాపారం జరిగినట్టు వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెడ్‌ఫైర్ క్రాకర్స్‌పై నిషేధం కనిపించింది. ఎక్కువగా పొగ, శబ్దం వచ్చే పేలుడు పటాకులకు బదులు ఫ్యాన్సీ, స్కై కొనుగోళ్లపై జనం ఎక్కువగా ఆసక్తి చూపించారు. నగరంలో సుమారు వెయ్యి దాకా ఫైర్ సేఫ్టీ శాఖ నుంచి అనుమతి పొందిన దుకాణాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు హోల్‌సేల్, విడిగా అమ్మకాలు కొనసాగించిన షాపులున్నాయి. గతంలో రూ.100 – నుంచి 150 కోట్ల దాకా వ్యాపారం జరుగుతుండేది. ఈ సారి రూ. 120 కోట్ల పటాకులు అమ్ముడు పోయినట్టు సమాచారం. మూడు రోజుల ముందు నుంచే నగరం పటాకుల మోతతో పండుగకు స్వాగతం పలికింది. చిన్న, పెద్ద తేడా లేకుండా దుకాణాల ముందు క్యూలు కట్టారు. హోల్‌సేల్‌తో పాటు రిటైల్ షాపుల్లోనూ క్రాకర్స్ అమ్మకాలు జరిగాయి. నెల చివరి రోజుల్లో పండుగ రావడంతో కొనుగోళ్లు కొంత తక్కువ జరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు.
వ్యాపారులకు తప్పని నష్టాలు
బ్రాండెడ్ కంపెనీ పటాకుల కొనేందుకే సిటీ జనం ఇంట్రస్ట్ చూపించారు. శివకాశిలో తయారైనవి, జయరాజ్ వంటి ప్రముఖ బ్రాండ్ ఉన్నవే ఎక్కువ అమ్మకాలు జరిగాయి.
అయితే బ్రాండెడ్ పటాకులను ముందుగానే పెద్ద వ్యాపారులు దక్కించుకోవడంతో ప్రత్యేకంగా ఈ సీజన్ కోసం వ్యాపారం చేసేవాళ్లు పెద్దగా అమ్మకాలు చేయలేకపోయారు.
నెల చివరిలో పండుగ రావడం, బ్రాండెడ్ పటాకులు లేకపోవడంతో తమ దుకాణాల్లో కొనుగోళ్లు తక్కువగా జరిగాయని బంజారాహిల్స్‌లోని స్టాల్ వ్యాపారి మోహన్ చెప్పాడు. ఇక్కడి ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన దుకాణాన్ని బట్టి ఒక్కోదానికి రూ.50 వేల నుంచి రూ. 3 లక్షల దాకా నష్టం రావచ్చని తెలిపాడు.
పర్యావరణ హితంగా
గతంలో జరిగిన అమ్మకాలను పరిశీలిస్తే ఈసారి క్రాకర్స్అమ్మకాలు సాధారణ రేంజ్‌లోనే కొనసాగాయి. అయితే పటాకుల కొనుగోళ్ల విషయంలో నగరవాసుల ఆలోచన సరళి మారినట్టు హోల్‌సేల్ వ్యాపారి శ్రీనివాస్ తెలిపారు. సుప్రీంకోర్టు సూచనలు, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సమాచారంతో పటాకుల ఎంపికలో వైవిధ్యం కనిపిస్తోందన్నారు. థౌజెండ్ వాలా, 2000వాలా వంటివి బ్యాన్ చేయడం కూడా ఓ ప్రధాన కారణంగా ఉంది. ఎక్కువ శబ్దంతో పేలే వాటికంటే రాకెట్లు, చిచ్చుబుడ్లు, విభిన్న రకాల్లో అందుబాటులో ఉన్న కాకర పువ్వులు వంటి ఫ్యాన్సీ క్రాకర్స్ కొనుగోళ్లు ఎక్కువగా జరిగాయన్నారు.