హైదరాబాద్ లో మంటలు..నిప్పు రవ్వలు పడి దాదాపు పది చోట్ల అగ్ని ప్రమాదాలు..

హైదరాబాద్ లో మంటలు..నిప్పు రవ్వలు పడి దాదాపు పది చోట్ల అగ్ని ప్రమాదాలు..
  • చేవెళ్ల పాత పట్వారీ ఆఫీసులో రికార్డుల దహనం...
  •     పలుచోట్ల తగలబడిన గోదాములు  
  •     రెండు చోట్ల పటాకుల దుకాణాల్లోనే ఫైర్​
  •     పుత్లిబౌలిలో రిఫ్రిజిరేటర్లు, ఏసీల కంప్రెసర్లు బుగ్గి

దీపావళి పండుగ వేళ భాగ్యనగరాన్ని అగ్నికీలలు చుట్టుముట్టాయి. సంబురంగా కాల్సిన పటాకుల నిప్పురవ్వలు పడి నగరవ్యాప్తంగా పదికి పైగా ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు సంభవించాయి. ఈ ఘటనల్లో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. పుత్లిబౌలిలో ఏసీలు, కంప్రెషర్లు బుగ్గి కాగా, చేవెళ్లలో పాత పట్వారీ ఆఫీసులో రికార్డులు కాలిపోయాయి. నాలుగైదు చోట్ల గోదాముల్లోని వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ముషీరాబాద్​లో పది  టూ వీటర్లు కాలిపోయాయి. ఓ చోట మెడికల్​షాపు, ఇంకోచోట కిరాణా షాపు, రెండు చోట్ల పటాకుల షాపుల్లోనూ మంటలు చెలరేగాయి. అయితే, ఎక్కడా  ప్రాణనష్టం జరగకలేదు. 

పుత్లిబౌలిలో కంప్రెసర్లు పేలి.. 

గోషామహల్ : రాకెట్లు పేల్చడంతో తారాజువ్వలు రెండంతస్తుల బిల్డింగుపై పడి అఫ్జల్‌గంజ్‌ పీఎస్​పరిధిలోని పుత్లిబౌలి చౌరస్తా సమీపంలోని ఓ బిల్డింగు గోదాంలో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో రిఫ్రిజిరేటర్లు, ఏసీల కంప్రెసర్లు పేలిపోయాయి. ఈ ఘటనతో స్థానికులు ఇండ్ల నుంచి పరుగులు తీశారు. సమాచారం ఇచ్చిన అరగంట తర్వాత ఫైర్ ​వెహికల్​రావడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 

పాత పట్వారీ ఆఫీసులో రికార్డులు  

చేవెళ్ల/పరిగి : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల తహసీల్దార్​ ఆఫీస్​ పక్కనే ఉన్న పాత పట్వారీ ఆఫీసులో పటాకుల నిప్పు రవ్వలు పడడంతో మంటలంటుకుని  రికార్డులు కాలిపోయాయి. అయితే, తహసీల్దార్​ మాట్లాడుతూ బిల్డింగులో రెవెన్యూ ఫైల్స్​ లేవని, ఎన్నికల టైంలో సిబ్బందికి ఇచ్చే పుస్తకాలు, వెరిఫై చేసిన తర్వాత పక్కన వేసే కాస్ట్, ఇన్ కం పత్రాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. అందులోనూ నాలుగు రూములు ఉంటే ఒక రూంలో ఉన్న స్ర్కాప్​ మాత్రమే కాలిపోయిందని పేర్కొన్నారు. అలాగే , పరిగి  పరిగి ఆర్టీసీ డిపో ఆవరణలో కూడా పటాకులతో నిప్పురవ్వలు పడి మంటలు చెలరేగాయి. చెత్త, చెట్లు కాలిపోయాయి.    

పటాకుల దుకాణాల్లో మోత..

కాప్రా/చిలకలగూడ :  ఓల్డ్ కాప్రా చౌరస్తాలో పలువురు యువకులు రాకెట్లను వదలడంతో ఆ నిప్పురవ్వలు పడి ఓ పటాకుల దుకాణం  కాలిపోయింది. కాప్రా తహసీల్దార్ ఆఫీసు పక్కనే పటాకులు అమ్ముతున్న షాపు కాలిపోతుండడంతో అక్కడే ఉన్న కొందరు యవకులు రోడ్డుపై వెళ్తున్న ట్యాంకర్‌ను ఆపి నీళ్లు కొట్టడంతో పెను ప్రమాదం తప్పింది.  చిలకలగూడ పరిధిలోని మైలార్‌గడ్డ వద్ద ఫైర్​క్రాకర్స్​షాపులో మంటలు చెలరేగి 20 నిమిషాల పాటు పటాకులు పెద్ద శబ్దాలతో పేలిపోయాయి. 

కాలి బూడిదైన గోదాములు

కూకట్​పల్లి/కుత్బుల్లాపూర్/పద్మారావునగర్: కూకట్​పల్లిలోని పాపారాయుడునగర్​లో  పేపర్​ ప్లేట్స్, గ్లాసుల తయారీ కేంద్రంలో తలెత్తిన మంటలు పక్కనే ఉన్న నెయ్యి, హల్దీరామ్స్​ గోదాంలకు వ్యాపించటంతో భారీ నష్టం వాటిల్లింది. పాపారాయుడునగర్​లో హల్దీరామ్స్​, జీబీఆర్​ నెయ్యి గోదాముల పక్కనే పేపర్​ ప్లేట్స్​, గ్లాసులు తయారు చేసే పరిశ్రమ ఉంది. ఆదివారం పేపర్​ప్లేట్స్​ పరిశ్రమలో మంటలంటుకుని నెయ్యి ప్యాకెట్ల గోదాంలోకి వ్యాపించాయి.  ఈ ఘటనలో రూ. 2 నుంచి 3 కోట్ల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.   జీడిమెట్లలో ఇండ్లుండే చోట ఉన్న స్ర్కాప్​ గోదాంలో పటాకుల నిప్పు రవ్వలు పడి కాలిపోయింది.  సీతాఫల్‌మండిలోని ఓ పేపర్‌గోడౌన్‌లో  సామగ్రి కాలి బూడిదైంది.  కాటేదాన్‌లోని ఒక ప్లాస్టిక్ తయారీ పరిశ్రమ గోదాములో మంటలు చెలరేగి ప్లాస్టిక్ వస్తువులు కాలిపోయాయి. మంటలు వేగంగా విస్తరించి పక్కనే ఉన్న ప్లైవుడ్ గోదాముకు అంటుకున్నాయి. రెండు గోదాములు పూర్తిగా దగ్ధం కావడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని ఉదంగడ్డ వద్ద ఉన్న ఒక ఈవెంట్ ఎక్విప్‌మెంట్ గోదాములో కూడా అగ్నిప్రమాదం జరిగింది. 

మెడికల్, కిరాణా షాపులు  

సికింద్రాబాద్​ పరిధిలోని బండిమెట్ లోని మారుతివీధిలో ఉన్న సాయి బాలాజీ డిస్ట్రిబ్యూటర్ డ్రగ్ మార్ట్ లో మంటలు ఎగసిపడటంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. సీతాఫల్‌మండి ఫ్లైఓవర్‌పై వెళ్తున్న జీహెచ్‌ఎంసీ చెత్త వాహనంపై పైనుంచి నిప్పురవ్వలు పడటంతో మంటలు వ్యాపించాయి. కుషాయిగూడ పరిధిలోని హెచ్​బీకాలనీలో రాందేవ్ మినీ సూపర్ మార్కెట్‌లో సామగ్రి పూర్తిగా కాలిబూడిదైంది . 

 10 టూవీలర్లు దగ్ధం 

ముషీరాబాద్ : నల్లకుంట లోని స్ట్రీట్ నెంబర్ 3 లో ఆదివారం రాత్రి ఓ వ్యక్తి రెండు టెన్​థౌజండ్​వాలాలకు ఒకేసారి నిప్పంటించాడు. దీంతో నిప్పు రవ్వలు పక్కనున్న టూ వీలర్లపై పడడంతో వరుసగా 10 బైకులు దగ్ధమయ్యాయి.   

వాషింగ్ మెషిన్ షార్ట్ సర్క్యూట్‌తో..

మల్కాజిగిరి, వెలుగు : మల్కాజిగిరి పరిధిలోని  చాణిక్యపురిలోని చంద్రగుప్త అపార్ట్‌మెంట్‌ రెండో అంతస్తులోని ఓ ఫ్లాట్​లోని వాషింగ్​మెషీన్​వద్ద షార్ట్ సర్క్యూట్ తోమంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇంట్లోని ఫర్నిచర్ అగ్నికి ఆహుతైంది.