టీఆర్ఎస్ను గద్దె దించాలని ప్రజలు చూస్తున్నారు

టీఆర్ఎస్ను గద్దె దించాలని ప్రజలు చూస్తున్నారు

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని, ఆయనకు ఎప్పుడూ రాజకీయం తప్పితే మరో ధ్యాసే ఉండదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. దేశంలో తెలంగాణ తప్ప మరే రాష్ట్రం బాగుపడలేదని తండ్రీకొడుకులు గప్పాలు కొడుతున్నారని మండిపడ్డారు. బుధవారం ఆమె హైదరాబాద్​లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ చేసిన మోసాలకు టీఆర్ఎస్ ను గద్దె దించాలని ప్రజలు చూస్తున్నారన్నారు. సీఎం కుర్చీ కాపాడుకునే యావ తప్పితే ఈ అయ్యా కొడుకులకు రాష్ట్రాన్ని బాగు చేయాలనే తపనే లేదన్నారు. గతంలో మిత్రుడైన ప్రధాని మోడీ.. ఇప్పుడు శత్రువు ఎలా అయ్యారని ప్రశ్నించారు. తెలంగాణకు శత్రువు మోడీ అని ఎలా కామెంట్స్ చేస్తావని ఫైర్ అయ్యారు. మీరు చేసే దోపిడీకి అడ్డు చెప్పకుంటే మిత్రుడు.. లేదంటే శత్రువా అని ప్రశ్నించారు. కాళేశ్వరం నుంచి కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చావా.. సమాధానం  చెప్పాలని డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయట్లేదని ప్రశ్నించారు. పాలమూరు–రంగారెడ్డి విషయంలో ఏపీ సీఎం జగన్ తో ఏం ఒప్పందం చేసుకొని, పక్క రాష్ట్రం వాళ్లు సంగమేశ్వరం ప్రాజెక్టు కడితే కేసీఆర్ మౌనంగా ఉన్నారని ఆరోపించారు. 

బైఎలక్షన్ తర్వాత బీజేపీలోకి వలసల వరద
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలిచాక టీఆర్ఎస్, కాంగ్రెస్‌‌ల నుంచి బీజేపీలోకి వలసలుంటాయని అరుణ చెప్పారు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఉత్తర తెలంగాణకు చెందిన ఓ ఏఐసీసీ స్థాయి నేత బీజేపీలోకి వస్తారన్నారు.