
హైదరాబాద్ : రాష్ట్రంలో శాంతి భద్రతలు కంట్రోల్ లో లేవని.. మహిళలకు, చిన్నారులకు కూడా రక్షణ లేకుండా పోతుందన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె.అరుణ . బైంసాలో నాలుగేళ్ళ బాలికపై జరిగిన అత్యాచార ఘటనను ఖండిస్తూ ఎల్బీ నగర్ లో ధర్నా నిర్వహించారు బీజేపీ నాయకులు. పెద్ద ఎత్తున ఎల్బీ నగర్ చౌరస్తాకు చేరుకున్న నేతలు అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు. ధర్నాలో పాల్గొన్నారు డికె.అరుణ. బైంసాలో ఓ నాలుగేళ్ళ చిన్నారిపై లైంగిక దాడి చేస్తే ప్రభుత్వం నోరు మూగపోయిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటివరకు స్పందించకపోవడం సిగ్గు చేటు అన్న ఆమె.. మా బిడ్డపై అఘాయిత్యం జరిగిందని ఆ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు పోతే... పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు.
కనీసం ట్రీట్మెంట్ కూడా చేయించకుండా పోలీసులు వ్యవహరించిన తీరు దారుణం అన్నారు. ఇలాంటి ఘటనలపై సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన సీఎం కేసీఆర్.. పోలీసులచే బాధితుల నోరు నొక్కించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఘటనపై విషయం తెలుసుకున్న బీజేపీ మహిళ నాయకురాలు ఆ బిడ్డను హైదరాబాద్ కు తరలించి చికిత్స అందించిందని తెలిపారు. ఘటనపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి, మెడికల్ రిపోర్ట్ తెప్పించుకుని దర్యాప్తు చేయించాలన్న అరుణ.. నిందితులపై వెంటనే యాక్షన్ తీసుకోవాలన్నారు. ఫాస్ట్రాక్ కోర్టులో వెంటనే విచారణ చేయించి , 2నెలలలో నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బాలిక కుటుంబానికి 10లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన అరుణ..చిన్నారిని కాపాడిన బీజేపీ నాయకురాలికి కూడా వేదిరింపు కాల్స్ వస్తున్నాయి.. వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. కేసీఆర్ కళ్ళు మూసుకొని ఉన్నాడని..ఆయనకు కనువిప్పు కలిగేందుకే కళ్ళగంతలు కట్టుకున్నామన్నారు అరుణ.