
హైదరాబాద్, వెలుగు: దేశంలోనే అతిపెద్ద స్కామ్ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిందని బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ ఆరోపించారు. రీడిజైన్ పేరుతో ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.63 వేల కోట్ల నుంచి రూ.1.50 లక్షల కోట్లకు పెంచారన్నారు. గతంలో ఈ ప్రాజెక్టుపై సీబీఐ విచారణ చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని కోరిందని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక జ్యుడీషియల్ ఎంక్వైరీ అని కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహార శైలి చూస్తుంటే కేసీఆర్‌ను కాపాడాలని చూస్తున్నారనే అనుమానం కలుగుతోందన్నారు.
ఆదివారం పార్టీ స్టేట్ ఆఫీసులో మీడియాతో డీకే అరుణ మాట్లాడారు. రాష్ట్రంలో సీబీఐకి నో ఎంట్రీ జీవోను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి, ప్రాజెక్ట్‌పై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు లేఖ రాయలేదో చెప్పాలన్నారు. కాళేశ్వరం గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రులను విమర్శించిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు సైలెంట్‌గా ఎందుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.