మహిళా రాజకీయాలతో అవినీతి లేని సమాజం

మహిళా రాజకీయాలతో అవినీతి లేని సమాజం

రంగారెడ్డి జిల్లా: మహిళలు రాజకీయంగా పెద్ద ఎత్తున రాణిస్తే అవినీతికి తావులేని సమాజాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డీకే అరుణ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.

‘మహిళల రాజకీయ ఎదుగుదలకు స్థానిక సంస్థలు గొప్ప అవకాశం. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉంది. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకొని మహిళలు రాజకీయంగా ఎదగాలి. శాసనసభలోనూ మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కృషి చేస్తున్నా.. ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కృషిచేస్తున్నామంటూనే మహిళల పట్ల చిన్న చూపు చూస్తోంది. రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వని అధికార పార్టీ మహిళా సంక్షేమం కోసం కట్టుబడి ఉంది అంటే నమ్మేదెలా.

శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు గవర్నర్ ప్రసంగం ఉండటం ఆనవాయితీ. కానీ.. మహిళల సంక్షేమం, అభ్యున్నతి అంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించారు. ప్రస్తుతం మన రాష్ట్ర గవర్నర్‎గా ఒక మహిళ ప్రాతినిధ్యం వహిస్తుంది. రాష్ట్రానికి ప్రథమ పౌరురాలు అయిన గవర్నర్ ప్రసంగం లేకుండానే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామనడం హాస్యాస్పదంగా ఉంది.

రాష్ట్రంలో అధికార పార్టీ ముందస్తు ఎన్నికల్లో భాగంగానే మహిళాభివృద్ధి, మహిళా సంక్షేమం అంటూ మహిళలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఎనిమిది ఏళ్లలో మహిళలకు ఏం చేశారో చెప్పాలి. అధికార పార్టీకి చెందిన రాష్ట్ర స్థాయి అధ్యక్షుడి నుంచి గల్లీ స్థాయి నాయకుడి వరకు అందరూ అవినీతి కూపంలో కూరుకుపోయి ఉన్నారు. అధికార పార్టీ నాయకులకు ప్రశ్నించేవారు ఉండకూడదని.. శాసనసభ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తారనే భయంతోనే వారిని సమావేశాల నుంచి బహిష్కరించారు.

దళిత బంధు పేరుతో దళితులను మోసం చేసిన కేసీఆర్.. ఇప్పుడు తాజాగా మహిళా బంధు పథకం అంటున్నారు. ఇది మహిళల అండతో మరోసారి అధికారంలోకి రావడానికే తప్ప.. మహిళా అభివృద్ధి కోసం ఏమాత్రం కాదు. మహిళలు మాత్రం ఈసారి టీఆర్ఎస్‎కు సరైన గుణపాఠం చెబుతారు. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టేసింది. ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‎తో.. రాష్ట్రం చేసిన అప్పు ఐదు లక్షల కోట్లకు చేరుకుంది. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో పుట్టబోయే బిడ్డ కూడా లక్ష రూపాయల అప్పుతోనే పుడుతున్నాడు’ అని డీకే అరుణ అన్నారు.