గద్వాల, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ప్రజలను పదేండ్లు బీఆర్ఎస్, రెండున్నర ఏండ్లు కాంగ్రెస్ ప్రభుత్వాలు మోసం చేశాయని, పాలనలో ఆ రెండు ప్రభుత్వాలు విఫలం అయ్యాయని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. శనివారం గద్వాలలోని డీకే బంగ్లాలో మీడియాతో మాట్లాడుతూ.. అసోం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు కానున్నాయని, కేరళ, తమిళనాడులో సైతం బీజేపీ కీలకపాత్ర పోషించనుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమని, తెలంగాణ ప్రజలంతా బీజేపీ వైపే చూస్తున్నారన్నారు. ఈ నెల 10న ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారని, ఈ సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారని చెప్పారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో రూ. 317 కోట్లతో జాతీయ రహదారులకు శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. దేశంలో 12 గ్రీన్‌ఫీల్డ్ జోన్లు ఏర్పాటు చేయడం జరిగిందని, తెలంగాణలోని జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు జరుగుతుందన్నారు. 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే సభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవకి వాసుదేవరావు రామాంజనేయులు, బండల వెంకట్రాములు, రామచంద్రారెడ్డి, రవికుమార్ పాల్గొన్నారు.
