
- డీఎంహెచ్వో శ్రీరామ్
కౌడిపల్లి, వెలుగు: వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తినొద్దని డీఎంహెచ్వో డాక్టర్ శ్రీరామ్ సూచించారు. ఇద్దరు విద్యార్థులు జ్వరంతో మృతి చెందిన నేపథ్యంలో ఆదివారం మండలంలోని తునికి గ్రామంలో నాలుగు టీమ్లతో సర్వే చేపట్టారు. డిప్యూటీ డీఎం హెచ్వో సృజన, రెవెన్యూ, పంచాయతీ, వైద్య సిబ్బంది గ్రామాన్ని పర్యవేక్షించారు. గ్రామంలో పరిశుభ్రత ఎలా ఉందనేది తనిఖీ చేశారు. డీఎం హెచ్వో మాట్లాడుతూ.. తినే ఆహారం నాణ్యతగా ఉండేలా చూసుకోవాలన్నారు. గ్రామంలో460 మందికి ఫీవర్ సర్వే నిర్వహించగా 60 మంది ఓపీకి వచ్చారని అందులో ఆరుగురికి ఫీవర్ ఉందన్నారు. వీళ్లకు రాపిడ్ టెస్ట్ తో పాటు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, జాండీస్ టెస్టులు నిర్వహించి శాంపిల్స్ మెదక్ పంపించామన్నారు.
తునికిలో వారం రోజులు మెడికల్ క్యాంపు నిర్వహిస్తామని చెప్పారు. ప్రతిరోజు ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు సూపర్వైజర్లు ఉండి గ్రామంలో పర్యవేక్షణ చేపడతామన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో మెడికల్, పంచాయతీ, హెల్త్ శాఖలతో వాట్సాప్ గ్రూపు ఉందని ఎక్కడ నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఫీవర్ వచ్చిన వారు వెంటనే సంబంధిత డాక్టర్లను సంప్రదించి సహకరించాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ కృష్ణ, ఎంపీవో కరీముల్లా, పీహెచ్సీ డాక్టర్ శ్రీకాంత్, హెల్త్ సిబ్బంది రమేశ్, శ్రీధర్ రెడ్డి, వైద్య బృందం ఉన్నారు.