“అమ్మ” పార్టీ అన్నాడీఎంకే వెనుకబడిందా

“అమ్మ” పార్టీ అన్నాడీఎంకే వెనుకబడిందా

అమ్మ’ పార్టీ అన్నాడీఎంకే వెనుకబడిందా! అధికారంలో ఉండికూడా డీఎంకే కన్నా తక్కువ ఓట్లు సాధించడంలోనే… తమిళనాడు మార్పువైపు పరుగులు తీస్తున్న సంగతి అర్థమవుతుంది.తమిళనాడులో డిసెంబర్​ చివరి వారంలో జరిగిన గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు జనవరి మొదటి వారంలో వచ్చాయి. స్టాలిన్​ నాయకత్వం​లోని డీఎంకే, దాని మిత్రపక్షాలు… రూలింగ్​లో ఉన్న అన్నాడీఎంకే, దాని మిత్రపక్షాలపై పైచేయి సాధించాయి. పంచాయతీ యూనియన్​ సీట్లలో 43.51 శాతం సీట్లను డీఎంకే తన ఖాతాలో వేసుకోగా అన్నాడీఎంకే 40.64 శాతం సీట్లు మాత్రమే సాధించి వెనకబడింది.  సీఎం పళనిస్వామి సొంత జిల్లా సేలం సహా రూలింగ్​ పార్టీకి కంచుకోట లాంటి పశ్చిమ ప్రాంతంలోని చాలా చోట్ల డీఎంకే నెగ్గటం విశేషం.

తనకు పట్టున్న సెంట్రల్​, నార్త్​ రీజియన్లలోని తిరుచిరాపల్లి, తిరువారూర్​, తిరువన్నమలై తదితర ఏరియాల్లోని మెజారిటీ సీట్లను డీఎంకే నిలబెట్టుకుంది. సేలంలోని 29 జిల్లా సీట్లలో అన్నాడీఎంకే, డీఎంకే చెరో నాలుగు స్థానాలు, ఇతరులు రెండు సీట్లు గెలిచారు. 288 పంచాయతీ యూనియన్​ సీట్లలో అన్నాడీఎంకే 71, డీఎంకే 44, ఇతరులు 51 కైవసం చేసుకున్నారు. కన్యాకుమారిలోని 11 జిల్లా సీట్లలో అన్నాడీఎంకే ఆరు, కాంగ్రెస్​ ఐదు సాధించాయి.

ప్రతిపక్షాలదే పైచేయి

తమిళనాడులోని మొత్తం జిల్లాల సంఖ్య 37 కాగా, 27 జిల్లాల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 91,975 పంచాయతీ వార్డ్​ మెంబర్​ పోస్టులకు; 9,624 ప్రెసిడెంట్​ పొజిషన్లకు; 5,090 పంచాయతీ యూనియన్​ పదవులకు; 515 జిల్లా పంచాయతీ వార్డ్​ మెంబర్​ సెగ్మెంట్లకి ఎలక్షన్స్​ పూర్తయ్యాయి. రీసెంట్​గా జరిగిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో విజయం సొంతం చేసుకున్న అన్నాడీఎంకే పంచాయతీ ఎలక్షన్స్​లోనూ ఇదే రిజల్ట్​ని రిపీట్​ చేస్తామనే గట్టి నమ్మకంతో ఉంది. ఊహించని విధంగా ప్రతిపక్షం ఎక్కువ సీట్లు నెగ్గటంతో షాక్​కి గురైంది. ఫలితాలు ఎలా ఉన్నా ప్రజల తీర్పును స్వాగతిస్తామని అన్నాడీఎంకే కోఆర్డినేటర్​, డిప్యూటీ సీఎం పన్నీర్​సెల్వం చెప్పారు. లోకల్​ బాడీ ఎలక్షన్స్​లో అధికార పార్టీ రన్నరప్​గా నిలవటాన్ని ఎదురు దెబ్బగానే భావిస్తారు. కానీ.. అధికార అన్నాడీఎంకే ఈ వాదనను తోసిపుచ్చుతోంది. లోక్​సభ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన తాము ఈ ఎనిమిది నెలల్లోనే ఈ రేంజ్​లో పుంజుకున్నామంటే అది ప్రజల అభిమానానికి, మద్దతుకు తిరుగులేని రుజువని ధీమాగా చెబుతోంది.