తమిళనాడు సర్కార్ ఘోర తప్పిదం .. ఇస్రో యాడ్​లో చైనా జెండా

తమిళనాడు సర్కార్ ఘోర తప్పిదం ..  ఇస్రో యాడ్​లో చైనా జెండా

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఇస్రో యాడ్​లో మన జెండాకు బదులు చైనా ఫ్లాగ్ పెట్టడం వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై బీజేపీ నేతలు డీఎంకే ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) రెండో లాంచ్‌‌‌‌ప్యాడ్‌‌‌‌ను తమిళనాడులోని కులశేఖరపట్నంలో నిర్మించనున్నారు. ప్రధాని మోదీ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో తమిళనాడు మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్ పలు పేపర్లకు యాడ్స్ ఇచ్చారు. వాటిలో ప్రధాని మోదీ, మాజీ సీఎం కరుణానిధి, సీఎం స్టాలిన్, అతని కొడుకు ఉదయనిధి ఫొటోలు ఉన్నాయి. మోదీ, స్టాలిన్ మధ్యలో రాకెట్ ఫొటో పెట్టారు. దానికి అగ్రభాగాన ఇండియా జెండా  బదులు చైనా జెండా చిత్రించారు. ఈ ఘటనపై డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడారు. ‘‘యాడ్ డిజైనర్ ఈ ఫొటో ఎక్కడి నుంచి తీశారో తెలియదు. ఇండియా జెండా ఉండాల్సిన చోట చైనా జెండా ఉంది. అయినా చైనాను శత్రు దేశంగా ప్రకటించలేదు కదా’’ అని అన్నారు.

క్రెడిట్ తీసుకోవడానికి ముందుంటది: మోదీ

ప్రధాని మోదీ కూడా దీన్ని తీవ్రంగా పరిగణించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రాజెక్టులపై డీఎంకే తన ముద్ర వేస్తున్నదని విమర్శించారు. వాటికి క్రెడిట్ దక్కేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ‘‘డీఎంకే ఏ పని చేయని పార్టీ. కానీ.. క్రెడిట్ తీసుకునేందుకు మాత్రం ముందుంటుంది. కేంద్ర పథకాలపై రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్లు అంటించుకుంటున్నారు. ఇప్పుడు చైనా స్టిక్కర్లును కూడా పెడ్తున్నారు’’అని తిరునల్వేలిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మండిపడ్డారు. ఇండియా అంతరిక్ష అభివృద్ధిని చూసేందుకు వారు సిద్ధంగా లేరని, ప్రజలు చెల్లించే పన్నులతో ప్రకటనలు ఇస్తూ, అందులో ఇండియా ఫొటోలు పెట్టరని ఆగ్రహం వ్యక్తం చేశారు.