
తమిళనాడులోని ద్రవిడ మున్నేట్ర కజగం(DMK) పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ఆ పార్టీ(DMK) అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో పాటు పలువురు పార్టీ సీనియర్ నేతలు మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన స్టాలిన్…స్కూళ్లు, కాలేజీల విద్యార్థులకు ఉచిత రైలు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషులుగా తేలి.. యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఏడుగురిని విడుదల చేయడానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలోని కేంద్ర కార్యాలయాల్లో తమిళం తప్పనిసరి, నీట్ రద్దు చేస్తాం, శ్రీలంక శరణార్థులకు భారత పౌరసత్వం, దక్షిణ భారత నదులు అనుసంధానానికి కృషి, విద్యా రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. కొడనాడు ఎస్టేట్ దొపిడీపై సీబీఐతో దర్యాప్తు చేయిస్తామనే అంశాలు మేనిఫెస్టోలు ఉన్నాయన్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో నష్టపోయిన వారికి పరిహారం, సేతు సముద్రం ప్రాజెక్టు తిరిగి పునరుద్దరణ, గ్యాస్, పెట్రోల్, డీజీల్ ధరలపై నియంత్రణ, మనుషుల అక్రమ రవాణాపై కఠిన చట్టాలు రూపొందించడం, పుదుచ్చేరికి ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించేందుకు కృషి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు వంటివి మేనిఫెస్టోలో చేర్చామన్నారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో DMK ఒక్క లోక్‌సభ సీటు కూడా గెలవలేదు. తమిళనాడులో మొత్తం 39 ఎంపీ స్థానాలు ఉన్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే 20 సీట్లలో పోటీ చేస్తుండగా మిగిలిన సీట్లను మిత్రపక్షాలకు కేటాయించింది.