
- బీఎల్ సంతోష్ ఉత్తర్వులూ పొడిగింపు
- విచారణ ఈనెల 13కి వాయిదా
హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తులో భాగంగా కేరళకు చెందిన జగ్గు కొట్టిలిల్ అలియాస్ డాక్టర్ జగ్గు స్వామికి సిట్ జారీచేసిన లుకౌట్ నోటీసు అమలును నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కేసులో బీజేపీ సీనియర్ నాయకుడు బీఎల్ సంతోష్‌కు జారీ చేసిన నోటీసు అమలును నిలిపివేస్తూ గతంలో జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను ఈ నెల 13 వరకు పొడిగించింది. సీఆర్‌పీసీ సెక్షన్ 11ఏ నోటీసు చట్టబద్ధతను తేలుస్తామని స్పష్టం చేసింది. అప్పటి వరకు 41ఎ నోటీసుతోపాటు లుకౌట్ నోటీసుల అమలును కూడా నిలిపివేయాలని పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌ను ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ కె.సురేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణను ఈ నెల 13కి వాయిదా వేశారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ జారీచేసిన లుకౌట్ నోటీసును సవాలు చేస్తూ జగ్గుస్వామి, సంతోష్ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. బీఎల్ సంతోష్ తరఫున సీనియర్ అడ్వొకేట్ దేశాయ్ ప్రకాష్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ను సిట్ సాక్షిగా పిలిచిందో, కేసులో అనుమానితుడిగా పిలిచిందో స్పష్టత లేదన్నారు. పిటిషనర్ చట్టానికి అతీతుడని చెప్పడం లేదని, సిట్ నోటీసులో స్పష్టత లేకపోవడంపై అభ్యంతరం చెబుతున్నామని చెప్పారు. చట్ట ప్రకారం నోటీసు లేదని, ఆ నోటీసును కొట్టేయాలని కోరారు. జగ్గుస్వామి తరఫున సీనియర్ అడ్వొకేట్ వి.పట్టాభి వాదిస్తూ.. 41ఎ నోటీసు జారీ అధికార దుర్వినియోగమన్నారు. 41, 41ఎ సెక్షన్లకు పెద్ద తేడా ఏమీ లేదన్నారు.
ఆ రెండూ నాణేనికి చెరో వైపు ఉండే కవలలన్నారు. జగ్గుస్వామి నిందితుడు కాదని, అయినా 41ఎ నోటీసు ఇచ్చారన్నారు. రిమాండ్ రిపోర్టులో కూడా ఆయన పేరు లేదన్నారు. ఇది రెండు పార్టీల మధ్య కేసని, రాజకీయ లక్ష్యసాధనలో భాగంగానే సిట్ దర్యాప్తు జరుగుతోందన్నారు. పిటిషనర్‌ను ఏవిధంగా నిందితుడిగా పిలుస్తారని ప్రశ్నించారు. కేసు వాస్తవాలు చెప్పకుండా విచారణకు రావాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ వాదనలకు వ్యతిరేకంగా సిట్ తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్, అదనపు ఏజీ రామచంద్రరావు వాదించారు. సిట్ దర్యాప్తు తర్వాతే ఆధారాలు ఉన్నాయని నిర్ధారించుకుని నోటీసులు ఇచ్చిందన్నారు. కేసంతా నోటీసులో చెప్పడం సాధ్యం కాదన్నారు. వాదనల తర్వాత హైకోర్టు.. సిట్ ఇచ్చిన లుకౌట్ నోటీసులపై స్టే విధించింది. విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది.