ఒమిక్రాన్​ భయం వద్దు!

ఒమిక్రాన్​ భయం వద్దు!

కరోనా కలవరం ఇప్పట్లో తగ్గేలాలేదు. డెల్టాప్లస్​ వేరియంట్​ ప్రభావం తగ్గుతుంది అనుకునే లోపే ఒమిక్రాన్​ రూపంలో కొత్తరకం వచ్చేసింది. ఈ కొత్తరకం వైరస్​ ఇన్ఫెక్షన్ ​తీవ్రత ఎలా ఉంటుందనేది పక్కాగా చెప్పలేకపోతున్నారు రీసెర్చర్లు. దాంతో వ్యాక్సిన్​ వేసుకున్నా కూడా కరోనా సోకుతుందేమోనన్న భయం మొదలైంది చాలామందిలో. అయితే కరోనా జాగ్రత్తలు పాటిస్తూ, అలర్ట్​గా ఉండడం ద్వారా ఒమిక్రాన్​ బారి నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు డాక్టర్​ రాహుల్​ అగర్వాల్​. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్​ వేరియంట్​ చూస్తుండగానే అన్నిదేశాల్ని చుట్టేస్తోంది. ఇంతకుముందు ఉన్న కరోనా వేరియంట్లతో పోల్చితే ఒమిక్రాన్​ వేరియంట్​కు స్పీడ్​ ఎక్కువ. ​ఫాస్ట్​గా వ్యాపిస్తూ.. అంతే తొందరగా ఇన్​ఫెక్ట్​ చేస్తుంది కూడా. దీనిలో 50కి పైగా మ్యుటెంట్స్​, వీటిలో 30 రకాలు ‘స్పై’ ప్రొటీన్​ (కరోనా వ్యాక్సిన్లు పనిచేసేది ఈ ప్రొటీన్​మీదనే) లోనే కనిపించాయని రీసెర్చర్లు చెబుతున్నారు. ‘స్పై’ ప్రొటీన్​లో మార్పుల వల్ల ఒమిక్రాన్​ వైరస్​  ఇన్ఫెక్షన్​, తీవ్రత ఎంత ఉంటుందనేది కచ్చితంగా నిర్ధారణకు రాలేకపోతున్నారు. ఈ కొత్తరకం వేరియంట్​ మిగతావాటికంటే ఎక్కువ ఇంపాక్ట్​ చూపిస్తుందని, మ్యుటేషన్ల కారణంగా దీనిపై వ్యాక్సిన్​, ఇమ్యూనిటీ ప్రభావం తక్కువని  ప్రపంచ ఆరోగ్య సంస్థ, సెంటర్ ఫర్​ డిసీజ్​ కంట్రోల్​ అండ్​ ప్రివెన్షన్​ (సిడిసి) చెప్తు న్నాయి. అంతేకాదు చిన్నపిల్లలు, పెద్దవాళ్ల మీద ఈ వైరస్ ఎఫెక్ట్​ ఎలా ఉంటుందనేది ఇప్పుడే  చెప్పలేం. 
ఒకేసారి వందమందికి
మనదగ్గర చాలామంది సెకండ్​ డోస్​ తీసుకున్నారు. అయితే, ఇప్పటికీ ఫస్ట్​ డోస్​ వ్యాక్సిన్​ తీసుకోని వాళ్లు ఉన్నారు.  సెకండ్​ డోస్​ తీసుకున్నవాళ్లకి సివియర్​ కొవిడ్​ వచ్చే ఛాన్స్​  93‌‌–95 శాతం తక్కువని, ఒమిక్రాన్​ అయితే 70 శాతం తక్కువని  అమెరికన్​ ఫార్మా కంపెనీ ఫైజర్​ స్టడీలో తేలింది. అయితే ఇప్పటికీ వందలో 20–30 మందికి సివియర్​ కొవిడ్​ వచ్చే ఛాన్స్​ ఉంది. ఒకప్పుడు పదిమందికి కరోనా ఇన్ఫెక్షన్​ వచ్చేది. కానీ ఇప్పుడు ఒకేసారి వందమందికి ఇన్ఫెక్షన్​ వచ్చేస్తుంది. ‌‌‌‌
ఒమిక్రాన్​ కేసుల్లో...
ఇప్పటి వరకు కరోనా సోకని వాళ్లకి ఒమిక్రాన్​ ఇన్ఫెక్షన్​ వచ్చే ఛాన్స్​ ఉంది. ఈ సారి ఫ్రెష్​ కొవిడ్​ ఇన్ఫెక్షన్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. ​ వ్యాక్సిన్​​ వేసుకున్న వాళ్లకి కూడా ఒమిక్రాన్ సోకవచ్చు. కరోనా నుంచి కోలుకున్నవాళ్లలో యాంటీ బాడీలు ఉంటాయి. అయితే 3 నెలల తర్వాత వాటి ప్రభావం తగ్గిపోతుంది.  దాంతో వాళ్లు కూడా ఒమిక్రాన్​ బారిన పడే ఛాన్స్​ ఉంది. అయితే, ఒమిక్రాన్​తో రీ–ఇన్ఫెక్షన్​ వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉంటుందనేది చెప్పలేం.​  చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటివి కూడా ఒమిక్రాన్​ ఇన్ఫెక్షన్​ రిస్క్​ని పెంచుతాయి. ​ 
లక్షణాలు
ఒమిక్రాన్​ వచ్చిన వాళ్లలో గొంతునొప్పి, జ్వరం, అలసట, తలనొప్పి వంటి లక్షణాలుంటాయి. ఒమిక్రాన్​ లక్షణాల తీవ్రత డెల్టా వేరియంట్​తో పోల్చితే ఎలా ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేం. 
ట్రీట్మెంట్​
కరోనా సోకిన వాళ్లకి రకరకాల ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి.  వీటన్నింటిలో మోనోక్లోనల్​ యాంటీ బాడీస్​, స్టిరాయిడ్స్​  బాగా పనిచేస్తున్నాయి. ఒమిక్రాన్​ ఇన్ఫెక్షన్​ని తగ్గించడానికి కూడా ఇవే ట్రీట్మెంట్లు ఉపయోగిస్తున్నారు చాలామంది. అయితే, ఇప్పటివరకు ఉన్న ట్రీట్మెంట్లలో ఏదీ పక్కాగా పనిచేస్తుందని, వంద శాతం‘యాంటీ–కొవిడ్’​ అని చెప్పలేమని చాలా స్టడీలు అంటున్నాయి. 
బూస్టర్​ డోస్​ అవసరం
బూస్టర్​ డోస్​ని టెటనస్​, డిఫ్తీరియా వంటి జబ్బులు ఉన్నవాళ్లకి ఇస్తున్నాం. అయితే, మొదటిసారి కరోనా వచ్చిన వాళ్లకి ట్రీట్మెంట్​ చేసే డాక్టర్లు, సేవలు చేసే నర్సులకి, చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నవాళ్లకి  బూస్టర్​ డోస్​ చాలా అవసరం. ఎందుకంటే.. కరోనా వ్యాక్సిన్​ రెండు డోసులు తీసుకున్నా కూడా ఒమిక్రాన్​ సోకే అవకాశం ఉంది.  
ఈ జాగ్రత్తలు ముఖ్యం
జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్​ని కలవాలి. కరోనా టెస్ట్​ చేయించుకోవాలి. బయటికి వెళ్లినప్పుడు మాస్క్​ పెట్టుకోవాలి.  తుమ్మినా, దగ్గినా ముక్కుకి అడ్డంగా రుమాలు పెట్టుకోవాలి. జనం ఎక్కువగా ఉండే ప్లేస్​లకి వెళ్లొద్దు. చేతులు తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. శానిటైజర్​ రాసుకోవడం మర్చిపోవద్దు. ఇమ్యూనిటీని పెంచే పండ్లు, కూరగాయలు ఎక్కువ తినాలి.