
బషీర్బాగ్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ అన్నారు. బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం మానుకోవాలని సూచించారు. లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. హైదర్ గూడ లోని ఎన్ఎస్ఎస్ లో అఖిల భారత బంజారా మహా సేవా సంఘ్ అధ్యక్షుడు జగన్ నాయక్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కవిత, కేటీఆర్ ల మధ్య గొడవతో ప్రజలకు ఏం సంబంధమని ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేత హోదాలో జీతభత్యాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ విధానాల్లో లోపాలుంటే ఎత్తిచూపాలి గానీ మీడియాపై దాడి చేయడం అవివేకమన్నారు. బీసీల ఆత్మగౌరవమైన 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ కాళేశ్వరంలో రూ.లక్ష కోట్లు దోచుకున్నారని, ప్రకటనల పేరుతో రూ.244 కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఆయన మళ్లీ సీఎం అవుతానని కలలు కంటున్నారని, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు.