చలాన్లు చెల్లించమని బలవంతపెట్టొద్దు: ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు ఆదేశం

చలాన్లు చెల్లించమని బలవంతపెట్టొద్దు: ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్: పెండింగ్ చలాన్ల విషయంలో ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాహనదారులను పెండింగ్ చలాన్లు చెల్లించమని బలవంతపెట్టొద్దని ఆదేశించింది. చలాన్లు చెల్లించాలని బైక్ కీస్ లాక్కోవడం, వాహనాన్ని ఆపేయడం లాంటివి చేయొద్దని హెచ్చరించింది. వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తేనే పోలీసులు వసూల్ చేసుకోవాలని పేర్కొంది.

ఒక వేళ పోలీసులు పెండింగ్ చలాన్లు వసూల్ చేయాలని భావిస్తే చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి వసూల్ చేయాలని సూచించింది. కాగా, ట్రాఫిక్ పోలీసులు నడి రోడ్డుపై బండ్లు ఆపి, తాళం లాక్కొని  బలవంతంగా చలాన్లు వసూలు చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‎పై మంగళవారం (జనవరి 20) కోర్టులో విచారణ జరిగింది. 

Also Read :  చీరల కోసం అర్థరాత్రి నుంచే క్యూ

పిటిషనర్ తరుపున న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపించారు. పెండింగ్ చలాన్ల వసూల్ కోసం ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను ఇబ్బందిపెడుతున్నారని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పెండింగ్ చలాన్ల విషయంలో ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బలవంతంగా పెండింగ్ చలాన్లు వసూల్ చేయొద్దని పోలీసులను ఆదేశించింది.