కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి ఇవ్వొద్దు : తమ్మినేని

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి ఇవ్వొద్దు : తమ్మినేని
  • సిట్టింగ్ జడ్జితోనే విచారణ చేయించాలె: తమ్మినేని

హైదరాబాద్, వెలుగు :  కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణను సీబీఐకి అప్పగించొద్దని, సిట్టింగ్ జడ్జితోనే న్యాయ విచారణ చేయించాలని  ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. దీనిపై రాజకీయ పార్టీలు, నీటి పారుదల నిపుణులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని గురువారం ఒక ప్రకటనలో సూచించారు. నాణ్యతతో నిర్మించకపోవడంతోనే మేడిగడ్డ ప్రాజెక్టు ఏడో బ్లాక్​లోని 19–21 పియర్స్ కుంగిపోయాయని, అన్నారం ప్రాజెక్టు ముందుభాగంలో కూడా బుంగపడి నీరు బయటకు వచ్చిందని తెలిపారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై అనేక అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.

కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించినప్పటికీ.. సీబీఐ విచారణ చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేయడం కరెక్ట్​ కాదని చెప్పారు. స్వతంత్ర సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీ తదితర శాఖలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పావులుగా వాడుకుంటోందని, ఈ పరిస్థితుల్లో సీబీఐకి అప్పజెప్తే బ్లాక్‌‌ మెయిలింగ్‌‌కు కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.