ధరణి పోర్టల్​లోని..ఏ ఒక్క తప్పునూ వదలం

ధరణి పోర్టల్​లోని..ఏ ఒక్క తప్పునూ వదలం
  •     ఏపీలోని రెవెన్యూ వ్యవస్థనూస్టడీ చేస్తమన్న ధరణి కమిటీ 
  •     త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు : ధరణి పోర్టల్​లోని ఏ ఒక్క తప్పునూ, విషయాన్ని వదలబోమని ధరణిపై ఏర్పాటైన కమిటీ ప్రకటించింది. క్షేత్రస్థాయిలో అమలు చేసేలా తమ సిఫార్సులు ఉంటాయని పేర్కొంది. ధరణి పోర్టల్​లో చేయాల్సిన మార్పులు, రెవెన్యూ వ్యవస్థ బలోపేతంపై రెండు రోజుల్లో సెలెక్టెడ్​ కలెక్టర్లతో సమావేశం కానున్నట్లు తెలిపింది. ఆర్డీఓలు, ఎమ్మార్వోలతోనూ సమావేశమై వాళ్ల నుంచి ఫీడ్​ బ్యాక్​ తీసుకోనున్నట్లు పేర్కొంది.

ఏపీలోని రెవెన్యూ విధానాన్ని కూడా స్టడీ చేయనున్నట్లు తెలిపింది.  ‘‘ధరణి లేదా ఏదైనా ప్రభుత్వ సాఫ్ట్​వేర్​కు అప్లికేషన్  సమర్పించినప్పుడు ఆ అప్లికేషన్​ను ఆమోదించిందీ లేనిదీ బయటకు తెలియాలి. ఎందుకు రిజెక్ట్ అయిందో దరఖాస్తుదారుడికి సమాచారం ఇవ్వాలి. ప్రతిదీ సర్వర్‌‌‌‌‌‌‌‌లో నిక్షిప్తం కావాలి. ధరణి పోర్టల్‌‌‌‌లో అలాంటి వ్యవస్థ సంపూర్ణంగా లేదు” అని పేర్కొంది. ధరణి పోర్టల్​ విషయంలో రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, అగ్రికల్చర్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లతోనూ సమన్వయం చేసుకోనున్నట్లు తెలిపింది.

ఒకే సారి నివేదికను అందించకుండా తాత్కాలిక, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి వేర్వేరుగా ప్రభుత్వానికి నివేదికలు అందిస్తామని వివరించింది. పట్టాదారు పాస్​బుక్​ చట్టం–2020కి సవరణలు తప్పనిసరి అని చెప్పింది. రీసర్వే అనేది అంతా ఈజీ కాదని.. ఒక్క ఏడాదిలో పూర్తయ్యేది కాదని పేర్కొంది. సోమవారం సీసీఎల్ఏ ఆఫీసులో సీసీఎల్​ఏ నవీన్​ మిట్టల్  అధ్యక్షతన మూడో సారి  ధరణి కమిటీ సమావేశమైంది. అనంతరం కమిటీ సభ్యులు రేమండ్​ పీటర్, ఎం.కోదండరెడ్డి, మధుసూదన్, సీఎమ్మాఆర్వో ప్రాజెక్టు డైరెక్టర్ వి.లచ్చిరెడ్డి మీడియాతో మాట్లాడారు.  

చాలా సమస్యలు ఉన్నయ్​

ధరణి పోర్టల్‌‌‌‌ సంస్కరణలతోపాటు మెరుగైన భూ పరిపాలన అందించేందుకు అవసరమైన సిఫార్సులను చేయనున్నట్లు రేమండ్​ పీటర్​ వివరించారు. ముందుగా ధరణి పోర్టల్‌‌‌‌లో సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచిస్తున్నట్లు చెప్పారు. అసైన్డ్, పీవోటీ లిస్ట్, ఇనాం, వక్ఫ్, ఎండోమెంట్, భూదాన్.. ఇలా చాలా వాటిలో సమస్యలు ఉన్నాయని, అన్నింటిపై చర్చించి వివరాలు తీసుకుని నివేదిక ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

భూమి సమస్యలు చాలా ఎమోషనల్‌‌‌‌తో కూడినవని, కానీ త్వరగా పరిష్కారం కావాలని తెలిపారు. కంప్యూటర్ రికార్డులతో మెరుగైన సేవలందాలి.. కానీ కొత్త సమస్యలు సృష్టించేటట్లుగా ఉండొద్దని అన్నారు.  ధరణి పోర్టల్‌‌‌‌లో సమస్యలను అనేకం గుర్తించామని, అయితే అవి ఎందుకు అలా ఉంటున్నాయనే దానిపై పరిష్కారం ఆలోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. కొత్త చట్టం 2020లోనూ కొన్ని మార్పులు అవసరమని భావిస్తున్నామన్నారు.

కోర్టు కేసులు, వాటి పరిశీలనలు కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిపారు. ధరణి పోర్టల్‌‌‌‌ని గత ప్రభుత్వం విదేశీ కంపెనీకి అప్పగించడం పొరపాటేనని సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారని కోదండరెడ్డి తెలిపారు. అక్రమ భూ లావాదేవీల విషయాలను కూడా కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు.  2018 కంటే ముందు భూమి హక్కుల విషయంలో కొన్నే సమస్యలు ఉండేవని, ధరణి అమలైన తర్వాతే ఈ సమస్యలు తీవ్రమయ్యాయని పేర్కొన్నారు.