ఈ ఇంజినీర్‌‌‌‌కు చదువు లేదు!

ఈ ఇంజినీర్‌‌‌‌కు చదువు లేదు!

అరటి చెట్టుతో ఎన్ని లాభాలుంటాయో అందరికీ తెలుసు. కాండం, పువ్వులు, ఆకులు, పండ్లు.. ఇలా ప్రతీదీ ఉపయోగమే. ఒకవేళ ఆ చెట్టులో వేస్ట్ అనేవి ఏవైనా ఉన్నాయంటే అవి అరటి పండ్లు తీసేసిన గెల, అరటిచెట్టు దగ్గర ఉండే వేస్ట్​ మాత్రమే. అరటి పిలకలు వచ్చిన వెంటనే వీటిని డంప్ చేసేస్తుంటారు. లేదా తగలబెడతారు. కానీ, తమిళనాడుకి చెందిన పిఎమ్ మురుగేశన్ దాన్ని వేస్ట్ చేయకుండా ఉపయోగిస్తున్నాడు. బనానా వేస్ట్‌‌తో నార తీస్తూ, ఎకో ఫ్రెండ్లీ మ్యాట్స్, బ్యాగ్స్, బ్యాస్కెట్స్ తయారు చేస్తున్నాడు. చదువుకునే స్తోమత లేకపోయినా ఇంజినీర్‌‌‌‌గా మారి నార తీసే మెషిన్లు తయారు చేస్తున్నాడు. ఫైబర్ బిజినెస్‌‌లో కోట్లు సంపాదిస్తున్న మురుగేశన్ సక్సెస్​ఫుల్​ జర్నీ విశేషాలు..

మదురై జిల్లా, మెలక్కల్ గ్రామంలో  పుట్టాడు మురుగేశన్. పేదరికం కారణంగా ఎనిమిదో తరగతితోనే చదువు ఆపేశాడు. అయితేనేం..తన తెలివితో.. కొత్త కొత్త మెషిన్లు కనిపెడుతూ, ఎన్నో అవార్డులు అందుకుంటున్నాడు.

ఐడియా రావడమే మొదలు

ఐడియా జీవితాన్నే మార్చేస్తుందనట్టు 2008లో మురుగేశన్‌‌కు వచ్చిన ఒక ఐడియా తన లైఫ్‌‌నే మార్చేసింది. అప్పటివరకూ ఊళ్లో చిన్న చిన్న పనులు చేసుకుని తిరిగేవాడు. ఒకరోజు పువ్వులను దండగా గుచ్చాలనుకుంటే ఇంట్లో దారం కనిపించలేదు. దాంతో  అరటిచెట్టు దగ్గర వేస్ట్‌‌గా పడి ఉన్న అరటికాండం తొడుగు నుంచి నార తీసి, దాంతో దండ గుచ్చాడు. అలా అప్పుడు వచ్చిన ఆలోచనతోనే బనానా ఫైబర్ బిజినెస్ మొదలుపెట్టాడు.  ఆలోచన వచ్చిందే మొదలు అరటి తోటల నుంచి వేస్ట్‌‌ను తీసుకొచ్చి తన భార్యతో కలిసి నార తీయడం ప్రారంభించాడు.

మెషిన్స్ తయారీలో..

కుటుంబ సభ్యులు, తెలిసినవాళ్లు నార తీయడానికి సాయపడ్డారు. కానీ, ఎక్కువ తీయాల్సి వచ్చినప్పుడు మనుషులు సరిపోయేవారు కాదు. దీంతో కొబ్బరి పీచును తాడులుగా చేసే మెషిన్ గురించి తెలుసుకున్నాడు. తను కూడా ఆ మెషిన్ తీసుకొచ్చి అరటి నారను తీయడానికి  ట్రై చేశాడు. కానీ అది పనిచేయలేదు. దానికి ఓ మోటర్‌‌‌‌ ఫిక్స్ చేశాడు. దాంతో ఎక్కువమంది అవసరం లేకుండానే, ఎక్కువ నార తీయడం మొదలు పెట్టాడు. అంతటితో మురుగేశన్ ఆగలేదు. ఆ మెషిన్‌‌ను ఇంకాస్త ఇన్నొవేటివ్‌‌గా చేయాలనుకున్నాడు. సపోర్ట్ మూమెంట్ కోసం చిన్న చక్రం, సైకిల్ వీల్ రిమ్స్ ఉపయోగించాడు. కొత్త స్పిన్సింగ్ మెషిన్‌‌ను కనిపెట్టి సక్సెస్ అయ్యాడు.

మరో కొత్త మెషిన్

మెషిన్ కనిపెట్టడమే కాదు దానికి పేటెంట్ కూడా సంపాదించాడు. మళ్లీ  2017లో మురుగేశన్ మరో కొత్త ఆటోమేటెడ్ రోప్ మేకింగ్‌‌ మెషిన్‌‌ డెవలప్ చేశాడు. ఇది అల్లడం, మెలితిప్పడం వంటి రెండు పనులూ చేస్తుంది. ‘‘హ్యాండ్ వీల్‌‌తో తాడును పేనేటప్పుడు ఒక చక్రానికి 2,500 మీటర్ల తాడు మాత్రమే వచ్చేది. కానీ ఈ ఆటోమేటెడ్ రోప్ మేకింగ్‌‌ను తయారు చేసిన తర్వాత 15వేల మీటర్ల తాడు తయారవుతుందంటాడు మురుగేశన్.

కోట్ల టర్నోవర్

మురుగేశన్ ‘ఎమ్ ఎస్ రోప్స్ ప్రొడక్షన్ సెంటర్’ అనే పేరుతో బనానా ఫైబర్ కంపెనీని ప్రారంభించాడు. మొదట ఐదుగురితో ఈ వ్యాపారం మొదలైంది. ప్రస్తుతం 350 మంది పనిచేస్తున్నారు. తమిళనాడే కాకుండా వివిధ రాష్ట్రాలకూ ప్రొడక్ట్‌‌ను ఎక్స్‌‌పోర్ట్ చేస్తున్నాడు. మరోపక్క నారతో ఎకో ఫ్రెండ్లీ బుట్టలు, బ్యాగులు, పలు రకాల మ్యాట్స్ తయారు చేస్తూ ఆంధ్ర, తెలంగాణలతో పాటు మణిపూర్, బీహార్, కేరళ వంటి పలు ప్రాంతాలకు ఎక్స్‌‌పోర్ట్ చేస్తున్నాడు. ‘‘నేను కనిపెట్టిన మెషిన్లు 40 వరకూ అమ్ముడయ్యాయి. ఆఫ్రికాకు పంపేందుకు నాబార్డ్ నుంచి 50 మెషిన్ల ఆర్డర్ వచ్చింది. ప్రస్తుతం ఏడాదికి ఒకటిన్నర కోట్ల టర్నోవర్  బిజినెస్ నడుస్తోంది”అని ఆనందంగా చెబుతున్నాడు మురుగేశన్.

అవార్డులెన్నో..

వ్యాపారంలో లాభాలు ఒక్కటే సరిపోవనుకున్నాడు. తాను కనిపెట్టిన మెషిన్లు దేశంలో రైతులందరికీ ఉపయోగపడాలనుకున్నాడు. నిరుద్యోగులు, యువ రైతులకు నార తయారీపై  తన కంపెనీలో ట్రైనింగ్ ఇస్తున్నాడు. మురుగేశన్‌‌కు ఏడు నేషనల్ అవార్డ్స్, అనేక స్టేట్ అవార్డ్స్ వచ్చాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ పరిధిలోని ఖాదీ, గ్రామ పరిశ్రమల కమిషన్ నుండి ‘ప్రధానమంత్రి ఉపాధి కల్పన అవార్డు’  కూడా అందుకున్నాడు. కేంద్ర వ్యవసాయ శాఖ నుండి ఒక అవార్డు, జబల్పూర్ విజ్జాన్ కేంద్రం నుండి ఒక అవార్డు దక్కించుకున్నాడు.