ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌ కు నో ఆర్సీ

ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌ కు  నో ఆర్సీ

 కేంద్ర రోడ్డురవాణా  మంత్రిత్వశాఖ ప్రపోజల్
న్యూ ఢిల్లీ: ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌ను మరింత ఎంకరేజ్ చేయడానికి వీటికి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) తీసుకోవాల్సిన అవసరం లేకుండా మినహాయింపులు ఇవ్వాలని, రెన్యువల్ ఫీజును రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.  2030 నాటికి కార్బన్ వాయువులను మూడో వంతు తగ్గిస్తామని ప్రకటించిన నేపథ్యంలో మోడీ ప్రభుత్వం ఈ ప్రపోజల్‌‌ను పరిశీలిస్తోంది. టెస్లా వంటి గిగా ఫ్యాక్టరీలను నిర్మించడానికి, ఈవీల బ్యాటరీలను తయారు చేయడానికి  రూ. 18,100 కోట్ల విలువైన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌‌ఐ) పథకాన్ని ఇప్పటికే ప్రభుత్వం ఆమోదించింది. చమురు దిగుమతులను, కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఈవీల తయారీని, వాడకాన్ని వీలైనంత పెంచడానికి గతంలోనూ ఫేమ్ వంటి స్కీములను ప్రకటించింది. 
మోటార్ వెహికల్స్ రూల్స్‌‌ను మార్చండి
"ఈవీలను ఎంకరేజ్ చేసేందుకు మా మంత్రిత్వ శాఖ గత నెల 27న ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది.  సెంట్రల్ మోటారు వెహికల్స్ రూల్స్ సవరించి  బ్యాటరీతో నడిచే వెహికల్స్‌‌ కు (బీఓవీ) ఆర్సీ రద్దు చేయాలని, రెన్యువల్ ఫీజును మాఫీ చేయాలని ప్రతిపాదించింది. సర్టిఫికేట్ (ఆర్సీ) , కొత్త రిజిస్ట్రేషన్ గుర్తును కేటాయించాలని కూడా సూచించింది ”అని కేంద్ర రోడ్డు రవాణా , హైవేల మంత్రిత్వ శాఖ  మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. జనం ఈవీలకు మారితే చమురు దిగుమతి బిల్లు భారీగా తగ్గుతుంది. మనదేశ చమురు అవసరాలు 80 శాతం వరకు దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. కంపెనీలు ఈవీల తయారీని పెంచుతాయి కాబట్టి  ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. ఇదిలా ఉంటే, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీల తయారీ కోసం 50 గిగా వాట్ అవర్ (జీడబ్ల్యుహెచ్) మాన్యుఫ్యాక్చరింగ్ కెపాసిటీని ఏర్పాటు చేయడానికి రూ.45 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఒక గిగావాట్ హవర్ (1,000- మెగావాట్ల హవర్) బ్యాటరీ సామర్థ్యం 10 లక్షల ఇండ్లకు, 30 వేల ఎలక్ట్రిక్ కార్లకు గంటపాటు కరెంటును ఇస్తుంది.  ఈ–-మొబిలిటీని ప్రోత్సహించడానికి తయారు చేసిన డ్రాఫ్ట్ పై నెల రోజుల్లోపు అభిప్రాయాలు తెలియజేయాలని సాధారణ ప్రజలను, ఈవీ ఇండస్ట్రీలను, బ్యాటరీ తయారీ కంపెనీలను కేంద్రం కోరింది.