
భారత్ లాంటి అతిపెద్ద మిత్రదేశం తన మాటలు వినకపోవటం, కనీసం పట్టింకుకోకపోవటం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి మింగుడుపడటం లేదు. భారత్ ను రష్యా క్రూడ్ కొనుగోలు విషయంలో ఏకాకిని చేయాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలవంతం కాకపోవటం, పెద్దన్నగా ఉన్న తన మాటే చెల్లకపోవటం పిచ్చెక్కిస్తోంది. దీంతో అంతర్మదనంలో పడ్డ ట్రంప్ ఇప్పుడు ఇతర దేశాలను కూడా రష్యా చమురు కొంటున్న దేశాలను టార్గెట్ చేస్తూ టారిఫ్స్ ప్రకటించాలంటూ పిలుపునిస్తున్నారు.
తాజాగా అమెరికా జీ7 దేశాలను కూడా రష్యా చమురు కొంటున్న దేశాలపై టారిఫ్స్ ప్రకటించాలని కోరింది. దీనికి ముందు యూరోపియన్ దేశాలను కూడా ఇలాంటి ఉసిగొల్పింది అమెరికా. ఇలా చేయటం ద్వారా రష్యాపై ఆర్థికంగా ఒత్తిడి పెంచి యుద్ధం ఆపే దిశగా పుతిన్ వచ్చేలా చేయాలని అమెరికా భావిస్తోంది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్, యూఎస్ వాణిజ్య ప్రతినిధి రాయబారి జామిసన్ గ్రీర్ G7 ఆర్థిక మంత్రులతో ఫోన్‌లో దీనిపై చర్చించారు.
ప్రస్తుతం అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకేలు జీ7 దేశాల జాబితాలో ఉన్నాయి. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడానికి నిజంగా కట్టుబడి ఉంటే రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై సుంకాలు విధించడంలో అమెరికాతో చేరాలని జీ7 ఆర్థిక మంత్రులతో జరిగిన ఫోన్ కాల్ లో కార్యదర్శి బెసెంట్ కోరారు.