కరోనా సాయం కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తీసుకోవద్దు

కరోనా సాయం కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తీసుకోవద్దు

జనం గొంతు నొక్కొద్దు
సోషల్ మీడియాలో సమస్యలు చెప్పినా, 
విమర్శించినా.. చర్యలొద్దు


న్యూఢిల్లీ:‘‘కరోనా సెకండ్ వేవ్ జాతీయ సంక్షోభం. ఈ సమయంలో తప్పుడు సమాచారం, రూమర్స్ అన్న సాకుతో జనం గొంతును నొక్కొద్దు’’ అని కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాల డీజీపీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆపదలో ఉన్న ప్రజలు సాయం కోరుతూ లేదా ఆక్సిజన్, బెడ్లు, డాక్టర్ల కొరత వంటి సమస్యలను తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు, మెసేజీలు పెడితే వారిపై చర్యలు తీసుకోవద్దని స్పష్టంచేసింది. ప్రజల వాయిస్​ను వినాల్సిందేనని, ప్రస్తుత కష్టకాలంలో ఇన్ఫర్మేషన్ ఫ్లోకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని తేల్చిచెప్పింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దేశంలో కరోనా కట్టడి కోసం జాతీయ పాలసీని అమలుచేసే విషయంపై చేపట్టిన సుమోటో కేసును జస్టిస్ డీవై చంద్రచూడ్, 
జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్​తో కూడిన ముగ్గురు సభ్యుల బెంచ్ శుక్రవారం 
విచారించింది.
అందరికీ ఫ్రీగా టీకాలు వేయాలి
కరోనా వ్యాక్సిన్ లకు వేర్వేరు ధరలు ఉండటంపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. టీకాలకు పేద ప్రజలు డబ్బులు చెల్లించలేరని, అందుకే దీనిని జాతీయ టీకా కార్యక్రమం కింద కేంద్రమే పూర్తిగా ఉచితంగా అమలు చేయాలని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాల ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్ దయతో బతకాల్నా? అని ప్రశ్నించింది. దేశ ప్రజలు అందరికీ ఫ్రీగా టీకాలు వేయాలని సూచించింది. 
కేంద్రానికి ఢిల్లీ సహకరించాలె
కరోనా కట్టడిలో ఢిల్లీ ప్రభుత్వం పనితీరు బాగాలేదని కోర్టు స్పష్టం చేసింది. విపత్తు సమయంలో రాజకీయాలు పక్కనపెట్టాలని, కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని చెప్పింది. కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి, ఢిల్లీలో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. 
రిటైర్డ్ డాక్టర్ల సేవలు వాడుకోవాలి 
ఆక్సిజన్ సమస్య పరిష్కారం, సప్లై సజావుగా సాగేందుకు చేపట్టవలిసిన చర్యలను కోర్టు పరిశీలించింది. దేశంలో చివరికి డాక్టర్లు, హెల్త్ కేర్ స్టాఫ్​కు కూడా బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని, స్వాంతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అయినా దవాఖాన్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ తగినంతగా డెవలప్ కాలేదని అభిప్రాయపడింది. హాస్టల్స్, గుడులు, చర్చిలను కూడా కొవిడ్ కేర్ సెంటర్లుగా మార్చాలని చెప్పింది. రిటైర్డ్ డాక్టర్లు, హెల్త్ కేర్ సిబ్బందిని కూడా రిక్రూట్ చేసుకోవాలని తెలిపింది.      
ఆక్సిజన్ కొరత లేదన్న కేంద్రం..
దేశంలో మెడికల్ ఆక్సిజన్ కొరతలేదని, సప్లై పెరుగుతోందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్​ ఇచ్చింది. నిరుడు ఆగస్టులో రోజుకు 6వేల టన్నులుగా ఉన్న ఆక్సిజన్ ఉత్పత్తి.. ఇప్పుడు 9 వేల టన్నులకు చేరిందని  వివరించింది.