నేను డబ్బు ఇవ్వను... మీరూ తీసుకోవద్దు

నేను డబ్బు ఇవ్వను... మీరూ తీసుకోవద్దు
  • మణిపూర్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న యంగ్  కంటెస్టెంట్ పోపిలాల్ సింగ్

మణిపూర్: 60 సీట్లు గల మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 100కు పైగా  కోటీశ్వరులే. మిగతావారు కనీసం లక్షల్లో సంపాదిస్తున్నారు. కానీ చేతిలో చిల్లీగవ్వ లేకున్నా...  ఆత్మస్థైర్యంతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాడు పోపిలాల్ సింగ్ అనే యంగ్ కంటెస్టెంట్. మణిపూర్‌లోని ఏకైక ఎస్సీ రిజర్వ్డ్ సీటైన సెక్‌మై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఈ 26 ఏళ్ల యువకుడు.. ‘ఓటు కోసం నేను డబ్బు ఇవ్వను, మీరూ తీసుకోవద్దు, కానీ ఓటు మాత్రం నాకే వేయాలంటూ’ వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. అందుకే ఇప్పుడు ఇతడు టాక్ ఆఫ్ ది కంట్రీగా నిలిచాడు. 

మొదట కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన నింగ్‌థౌజం పోపిలాల్ సింగ్.. కాంగ్రెస్ నిరాకరించడంతో ఎన్సీపీ నుంచి బరిలోకి దిగాడు. నామినేషనయితే వేశాడు కానీ ఓట్ల కోసం జనాల్లోకి ఎలా వెళ్లాలి అనే ప్రశ్న పోపిలాల్ సింగ్ ను ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే తన ప్రత్యర్థులు ఆర్థికంగా చాలా బలవంతులు. మరి అలాంటివారిని ఢీకొట్టాలంటే వాళ్లకంటే ఎక్కువ డబ్బుండాలి తన వద్ద. కానీ ఒక్క రూపాయి కూడా లేదు. అయినా .. ఈ యువ నేత ఏమాత్రం నిరుత్సాహపడలేదు. గెలవాలంటే ఉండాల్సింది డబ్బు కాదు.. ఆత్మస్థైర్యమంటూ ఇంటింటికి తిరుగుతూ ఓట్లు కూడగట్టుకుంటున్నాడు. 

‘నేను గ్రాడ్యుయేషన్ చదివిన నిరుద్యోగిని. ట్యూషన్లు చెప్పుకొని జీవనం సాగిస్తున్నాను. నా నియోజకవర్గ ప్రజలు డబ్బు వెంట పరుగెత్తరు. ఏ ఒక్క అభ్యర్థి వాళ్లను డబ్బుతో కొనలేరు’ అని అంటున్నాడీ యువకుడు. తన మీద అభిమానంతో కొంతమంది స్థానికులు చందాలు ఇస్తున్నారని, వాటితోనే  ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నానని పోపిలాల్ సింగ్ చెబుతున్నాడు. తాను గెలిస్తే నియోజకవర్గంలో ఉన్న అట్టడుగు వర్గాల వారికి అధిక ప్రాధాన్యతనిస్తానని, విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తానని, తన నియోజకవర్గంలో అవినీతికి తావులేకుండా చేస్తానని హామీలు ఇస్తున్నాడు. 

‘పోపిలాల్ సింగ్ ఎన్నిక మేనిఫెస్టో బాగుంది. అతడి ప్రవర్తన, ప్రచారం చాలా బాగున్నాయి. అందుకే అతడికి నా మద్ధతు ప్రకటిస్తున్నా’ అని అంటున్నాడు అంగోమ్ ఆశాకిరణ్. గెలుపోటములు పక్కన పెడితే.. రాజకీయాల్లోకి రావాలనుకునే ప్రతి యువకుడికి పోపిలాల్ సింగ్ ఆదర్శం. అందుకే అతడి గురించి తెలిసిన ప్రతి  ఒక్కరూ .. అతడు గెలవాలని కోరుకుంటున్నారు. కాగా మణిపూర్ అసెంబ్లీకి ఫిబ్రవరి 28న మొదటి, మార్చి 5న రెండో విడత ఎన్నికలు జరుగనున్నాయి.

మరిన్ని వార్తల కోసం..

'కళావతి’ పాటకు సితార స్టెప్పులు

రీల్ సీఎంగా యడ్యూరప్ప