
- ప్రశ్నలు సూటిగా అడగండి : లోక్సభ స్పీకర్ ఓంబిర్లా
న్యూఢిల్లీ: లోక్సభ సమావేశాల్లో భాగంగా స్పీకర్ ఓంబిర్లా ఓ ఎంపీపై ఫైర్ అయ్యారు. సభలో మహాభారత కథలు చెప్పొద్దని, అడగాలనుకున్న ప్రశ్నలు సూటిగా అడగాలని సూచించారు. ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ బార్గర్ ప్రదీప్ పురోహిత్ ఆయుర్వేదిక్కళాశాలపై కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ మంత్రికి ఓ ప్రశ్న సంధించారు. ఈ సందర్భంగా ఆయన ఆ కళాశాల ప్రాంతంలో పురాతన కాలంలో కొన్ని మూలికలు లభించేవంటూ చరిత్ర వల్లెవేశారు.
దీంతో స్పీకర్ కలుగ జేసుకొని, విషయాలను సూటిగా ప్రస్తావించాలని, సభలో కథలు చెప్పొద్దని ఘాటుగా చెప్పారు. ఈ మధ్య సభలో మహాభారతం చెప్పడం ఫ్యాషనైపోయిందని వ్యాఖ్యానించారు. కాగా, సోమవారం లోక్ సభ సమావేశాల్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మహాభారతంలోని చక్రవ్యూహం గురించి ప్రస్తావించారు. ఆరుగురు వ్యక్తులు దేశం మొత్తాన్ని ‘పద్మవ్యూహం’లోకి నెట్టివేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా స్పీకర్ చేసినకామెంట్స్ప్రాధాన్యత సంతరించుకున్నాయి.