అవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దు

అవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దు
  • శివారులో కుండపోత.. సిటీలో జల్లులు
  • పలు కాలనీలను చుట్టుముట్టిన వరద
  • ఇయ్యాల గ్రేటర్​ పరిధిలో ఆరెంజ్​ అలర్ట్

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​ సిటీని వాన వదిలిపెట్టడం లేదు. గురువారం కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని కాలనీలను వరద చుట్టుముట్టింది. వాటర్​ లాగింగ్ ​పాయింట్ల వద్ద నడుము లోతు వర్షపు నీరు నిలిచింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పొద్దున ఎండ వస్తూ పోతూ ఉండగా మధ్యాహ్నం 2 గంటల తర్వాత మబ్బులు పట్టాయి. 3 గంటలకు శివారు ప్రాంతంలో వాన దంచికొట్టింది. సిటీలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఎల్​బీనగర్, హయత్ నగర్, వనస్థలిపురం, మీర్ పేట, దిల్​సుఖ్​నగర్, ఇబ్రహీంపట్నం, బాలాపూర్, బడంగ్​పేట పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎల్​బీనగర్​ క్రాస్​రోడ్డు, భాగ్యలత, పనామా, చింతలకుంట ప్రాంతాల్లోని విజయవాడ నేషనల్ హైవేపై మోకాలి లోతు వరద నీరు నిలిచింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లింగోజిగూడ భాగ్యనగర్ కాలనీ, కాకతీయ కాలనీ, పీఎన్టీ కాలనీ, చింతలకుంట సరస్వతీనగర్ కాలనీల్లో డ్రైనేజీలు పొంగి పొర్లాయి. దిల్​సుఖ్​నగర్ ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి. కాప్రా, కుషాయిగూడ, చర్లపల్లి, జవహర్ నగర్, దమ్మాయిగూడ, నాగారం, కీసర, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, రాజేంద్రనగర్, సీతాఫల్ మండి, అమీర్​పేట, ఉప్పల్, నాంపల్లి, రామాంతాపూర్, ఓల్డ్​సిటీలోనూ వాన పడింది.

అర్ధరాత్రి వరకు జల్లులు కురుస్తూనే ఉన్నాయి. వర్షం ఎఫెక్ట్​తో సాయంత్రం టైంలో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ ​నిలిచింది. వర్షంతో సిటీలోనే అనేక ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. రోడ్లపై గుంతల్లో వాన నీరు చేరడంతో వెహికల్స్​ నెమ్మదిగా కదిలాయి. ఉప్పర్‌పల్లి, నేషనల్‌ పోలీస్‌ అకాడామీ, శివరాంపల్లి, ఆరాంఘర్‌ ప్రాంతాల్లో వరద నిలిచి వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. సిటీ శివారు, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ ​జిల్లాల్లోనూ వాగులు పొంగిపొర్లాయి. వికారాబాద్​జిల్లాలోని  చిట్టెంపల్లి, గోధుమగూడ, గాజీపూర్, ఊరెంట వాగులకు వరద పోటెత్తింది. గాజీపూర్ వద్ద రైల్వే అండర్​బ్రిడ్జి వద్ద భారీగా వరద నీరు నిలిచింది. గ్రేటర్​పరిధిలోని 4 జిల్లాల్లో ఇయ్యాల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని రెవెన్యూ, పోలీస్ ​శాఖలు సూచించాయి. కాగా జీహెచ్ఎంసీలో కాంట్రాక్టర్ల సమ్మెతో జనానికి పలు సేవలు అందడం లేదు. ముఖ్యంగా మాన్​సూన్​ టీమ్స్​అందుబాటులో లేక ఎక్కడికక్కడ వర్షపు నీరు రోడ్లపై నిలుస్తోంది. 

నీట మునిగిన అయ్యప్ప నగర్ ​కాలనీ

ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నాగోల్​లోని అయ్యప్ప నగర్ కాలనీని చుట్టుముట్టింది. చాలా ఇండ్లలోకి వాన నీళ్లు చేరాయి. సామగ్రి తడిసిపోయింది. మూడ్రోజులుగా ఇబ్బందులు పడుతున్నా అధికారులు తమను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి రెండు ఇండ్లకు మెటార్లు పెట్టి వెళ్లిపోతున్నారని ఆరోపిస్తున్నారు. అంతగా అయితే ఇండ్లు ఖాళీ చేసి వెళ్లిపోండని బెదిరిస్తున్నారని చెప్పారు. సాయంత్రం దాకా ఎవరూ రాకపోవడంతో కొందరు చుట్టుపక్కల వాళ్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు.