ఓఆర్ఆర్ ప్రాజెక్టు పచ్చని పొలాల్లో చిచ్చు పెడుతోంది

ఓఆర్ఆర్ ప్రాజెక్టు పచ్చని పొలాల్లో చిచ్చు పెడుతోంది
  • సీఎం కేసీఆర్కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
  • అభివృద్ధి పేరుతో పేద రైతుల జీవితాలను ధ్వంసం చేయాలని చూస్తున్నారు
  • జయశంకర్ సార్ సొంత గ్రామంలో అభివృద్ధి లేకపోవడం  పల్లె ప్రగతి డొల్లతనానికి నిదర్శనం: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ఓఆర్ఆర్ ప్రాజెక్టు పచ్చని పొలాల్లో చిచ్చు పెడుతోందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ధి పేరుతో పేద రైతుల జీవితాలను ధ్వంసం చేయాలని చూస్తే.. కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. జయశంకర్ సార్ సొంత గ్రామంలో అభివృద్ధి లేకపోవడం  పల్లె ప్రగతి డొల్లతనానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్వగ్రామం అక్కంపేట అభివృద్ధి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వహిస్తోందని, వరంగల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతుల వ్యధలపై ఆయన సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. 

‘ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఎనిమిదేళ్లవుతున్నా జయశంకర్ సార్ స్వగ్రామంలో అభివృద్ధి అనేది మచ్చుకైనా కానరావడం లేదు.. ఎంతో మంది ప్రజాప్రతినిధులు ఈ గ్రామాన్ని సందర్శించి ఊరు బాగుకోసం ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారాయి.. ఆ ఊరిలో పరిస్థితులు చాలా ఆధ్వాన్నంగా ఉన్నాయి.. కనీస మౌలిక సదుపాయాలకు కూడా ఆ గ్రామం నోచుకోకపోవడం దురదృష్టకరం.. ఇప్పటికీ రెవెన్యూ విలేజ్ హోదా ఆ గ్రామానికి ఇవ్వకపోవడం అత్యంత విచారకరం..’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 
ఆచార్య జయశంకర్ సార్ పై విద్వేషం, వ్యతిరేక భావం 
‘మీరేమో మైకుల ముందు రాష్ట్రంలో ఇన్ని గ్రామ పంచాయితీలను కొత్తగా చేశాం, తండాలను పంచాయితీలుగా మార్చాం అని ప్రగ్భలాలు పలుకుతుంటారు. కానీ ఆచార్య జయశంకర్ పుట్టిన ఊరు అక్కంపేటను ఇంకా రెవెన్యూ విలేజ్ గా గుర్తించలేదంటే మీ మనస్సులో ఆ పెద్దమనిషి మీద ఎంత విద్వేషం, వ్యతిరేక భావం ఉందో అర్ధమవుతుంది. అక్కంపేట ఇప్పటికీ పెద్దాపూర్ విలేజ్ పరిధిలోనే కొనసాగుతుండటం క్షమించరాని అంశం..’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 
దళితబంధు గొప్పలు చెప్పుకోవడానికే.. దళితుల జీవితాల్లో మార్పు రాలేదు
‘నిన్న అక్కంపేట గ్రామంలోని నిరుపేద దళితుడు  చిలువేరు జానీ కుటుంబంతో కలిసి భోజనం చేశాను.. చాలా దీనమైన పరిస్థితుల్లో  కుటుంబం జీవనం సాగిస్తోంది.. వారికి కనీసం సొంత ఇళ్లు సైతం లేదు. దళిత బంధు అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్పితే దళిత జీవితాల్లో ఎటువంటి మార్పు రాలేదని ఆ కుటుంబాన్ని చూస్తే అర్థమవుతోంది..ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. మరో దారుణమైన  విషయం..ఆ ఊరికి మిషన్ భగీరథ నీళ్లు కూడా రావడం లేదు. కాబట్టి ఆ గ్రామానికి మంచి నీళ్లు అందించేందుకు వీలుగా మిషన్ భగీరథ పనులను తక్షణమే ప్రారంభించాలి. పల్లె ప్రగతితో ఎన్నో అద్భుతాలు సృష్టించాం.. మన పల్లెలు దేశానికి ఆదర్శం అని సొల్లు కబుర్లు చెబుతుంటారు. సాక్షాత్తూ జయశంకర్ సార్ సొంత గ్రామంలో అభివృద్ధి లేదంటే  పల్లె ప్రగతిలోని డొల్లతనం అర్ధమవుతోంది. 
అక్కంపేటలో జయశంకర్ స్మృతి వనం నిర్మించాలి
జయశంకర్ స్వగ్రామం అక్కంపేటలో సార్ పేరిట స్మృతి వనం నిర్మించాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ప్రాజెక్టు కోసం కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా)  ల్యాండ్ పూలింగ్ విధానంలో పెద్ద ఎత్తున భూ సేకరణకు సిద్ధమైందని, అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు, అలాగే  మౌలిక సదుపాయాల కల్పనకు విముఖం కాదు,  కానీ ఓఆర్ఆర్ ప్రాజెక్టు మాత్రం పచ్చని పొలాల్లో చిచ్చు పెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.  ఓఆర్ఆర్ కోసం కూడా వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో కలిపి మొత్తం 27 గ్రామాల్లో 21,517  ఎకరాలను సేకరించేందుకు సిద్ధమైంది. ఫలితంగా లక్ష మందికి పైగా రైతులు, కౌలుదారులు రోడ్డునపడే పరిస్థితి దాపురించిందన్నారు. ఇందులో అధిక శాతం మంది రెండు, మూడు ఎకరాలు ఉన్న సన్నకారు, చిన్నకారు రైతులే ఉన్నారని, వారికి ఆ పొలాలే ఆధారం. రెక్కల కష్టంతో ఆ పొలాలను సాగు చేసుకుంటే వచ్చే ఆదాయమే వారి దిక్కు.. ఇప్పుడు మీరు ప్రాజెక్టు పేరుతో నోటి కాడి ముద్దను లాక్కుంటే వారు ఎలా బతకాలి?  నిన్న ఆయా ప్రాంతాల్లో పర్యటించినప్పుడు నా ముందు వారు తమ గోడును వెళ్లబోసుకున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 
వయసులో పెద్దోళ్లు.. రెక్కల కష్టంతో బతుకు బండి లాగిస్తున్నారు
‘ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న అందరూ పేదరికంలో మగ్గుతున్న వారంతా చిన్న, సన్నకారు రైతులే. వయసులో పెద్దవాళ్లు.. తమ రెక్కల కష్టంతో బతుకు బండి లాగిస్తున్నారు.. ఇన్నాళ్లూ రైతుగా గౌరవంగా బతికిన వాళ్లు ఇప్పుడు తమ పోషణ కోసం ఏ పని చేయాలి.. పొలం పోతే ఏదైనా ఉద్యోగం చేసుకుందామంటే.. చదువు లేదు. వయసు సహకరించదు.. రైతుల నుంచి వలస కూలీల స్థాయికి వారి బతుకులు దిగజారుతాయి..ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్న వారికి ఏవిధంగాను అన్యాయం జరగడానికి వీల్లేదు..వాళ్ల ఉసురు తీయొద్దు’ అని రేవంత్ రెడ్డి సూచించారు.
భూసేకరణ ప్రకటన వచ్చినప్పటి నుంచి దినదినగండంగా బతుకుతున్నారు  
భూ సేకరణ ప్రకటన వచ్చినప్పటి నుంచి దినదినగండంగా ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళనతో కంటి మీద కనుకు లేకుండా  బతుకుతున్నారు.. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను వెనక్కి తీసుకుంటున్నట్లు కింది స్థాయి నాయకులు చేస్తున్న ప్రకటనలు వారిలో విశ్వాసం నింపడం లేదు.. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో సంబంధిత జీవోను వెనక్కి తీసుకుంటునట్లు మీరు స్పష్టమైన ప్రకటన చేస్తే వారిలో ఆందోళన తగ్గి నిశ్చితంగా ఉంటారు.. లేకుంటే ఆ రైతుల  పక్షాన కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో ఉద్యమిస్తుంది.. ల్యాండ్ పూలింగ్ విధానాన్ని వెనక్కి తీసుకునే దాకా విశ్రమం లేని పోరాటం సాగిస్తుంది..’ అని బహిరంగ లేఖలో  రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.