పల్లె ప్రగతి ఇప్పుడు వద్దు..  వానాకాలంలో పెట్టండి

పల్లె ప్రగతి ఇప్పుడు వద్దు..  వానాకాలంలో పెట్టండి

హైదరాబాద్, వెలుగు: పల్లె ప్రగతి ఇప్పుడు వద్దని, వానాకాలంలో నిర్వహించాలని గ్రామ సర్పంచ్‌‌లు కోరుతున్నారు. ఎండా కాలంలో గ్రామాల్లో పెద్దగా చేయడానికి పనులేవీ ఉండవని, అదే వానాకాంలో ఉంటాయని చెబుతున్నారు. దీంతో పల్లె ప్రగతి షెడ్యూల్‌‌ మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మే 20 నుంచి జూన్ 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిర్వహించాలని ఇటీవల కేబినెట్‌‌ నిర్ణయించింది. ఇందుకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి. 
 

గతంలో వానాకాలంలోనే 
పల్లె ప్రగతి కార్యక్రమాన్ని 2019 సెప్టెంబర్‌‌లో ప్రభుత్వం ప్రారంభించింది. అక్టోబర్‌‌‌‌ 5 వరకు ఆ కార్యక్రమాన్ని నిర్వహించింది. 2020లో జనవరి, జూన్‌‌లో, 2021లో జులైలో ఈ ప్రోగ్రామ్‌‌ కింద పనులు చేశారు. ఇందులో భాగంగా గ్రామాల్లో డ్రైనేజీలు శుభ్రపరచడం, పాత ఇండ్లు, బావులు, బోర్లు పూడ్చడం, మొక్కల పంపిణీ, చెత్త సేకరణ, ఫాగింగ్ తదితర పనులు చేస్తున్నారు. 
 

వానకాలంలోనే సమస్యలు
సాధారణంగా వానాకాలంలోనే ఊర్లలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వానలతో నీళ్లు నిలిచిపోవడం, డ్రైనేజీలు పొంగి పొర్లడం, పైపు లైన్ల రిపేర్లు రావడంతో పాటు మలేరియా, డెంగీ, జ్వరాలు కూడా వస్తుంటాయి. ఈ వ్యాధులు విస్తరించకుండా ఉండేందుకు పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టినట్లు మంత్రులు, అధికారులు చాలాసార్లు చెప్పారు. అయితే ఇప్పుడు ఎండాకాలంలో ఈ కార్యక్రమాన్ని చేపడితే పెద్దగా ఉపయోగం ఉండదని పలువురు భావిస్తున్నారు. 
 

ఇప్పుడు పనులుండవ్‌‌ 
ఎండాకాలంలో పల్లె ప్రగతి నిర్వహిస్తే గ్రామాల్లో చేయటానికి పనులేమీ ఉండవు. వానాకాలంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. పల్లె ప్రగతిలో 
ఆ సమస్యలన్నీ తీర్చవచ్చు.                                                                                                                                             - శ్రీరామ్ రెడ్డి, దామెర సర్పంచ్, హనుమకొండ జిల్లా