మేం తీవ్రవాదుల్లా కనిపిస్తున్నామా..?

మేం తీవ్రవాదుల్లా కనిపిస్తున్నామా..?

బీజేపీ నేతలు, కార్యకర్తల గృహ నిర్బంధం అనైతికం

ప్రభుత్వ చర్యలను ఎదుర్కొంటాం.. పోరాటం కొనసాగిస్తాం-సోము వీర్రాజు

రాజమండ్రి: ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల్లో తిరిగే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేయటం అనైతికం.. మేము తీవ్రవాదులమా? నక్సలైట్లమా? అని ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. తనతోపాటు బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ పార్టీ, హిందుత్వం కోసం ఆలోచించే పార్టీ అన్నారు. అంతర్వేది లక్ష్మి నరసింహా స్వామి రధం కాల్చేస్తే ప్రజాస్వామ్యంలో చూడటానికి కూడా హక్కు లేదా? అని ప్రశ్నించారు. పోలీసులు హౌస్ అరెస్టు చేసిన బీజేపీ నాయకులను, కార్యకర్తలను వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. హౌస్ అరెస్టులను బీజేపీ సహించదు.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఎదుర్కొంటాము..  ప్రభుత్వంపై పోరాటం కొనసాస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. హిందుత్వ సంస్థలు చేసే పోరాటానికి బీజేపీ నైతికంగా మద్దతు ఇస్తుందన్నారు. చర్చిలపై రాళ్లు వేస్తే మాత్రం ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని, రథాలు కాల్చివేస్తే, విగ్రహాలు ధ్వంసం చేస్తే ప్రభుత్వానికి పట్టదా? అని ప్రశ్నించారు. టీటీడీ నిధులను ప్రభుత్వం వాడుకుంటుందని సోము వీర్రాజు ఆరోపించారు.