హైదరాబాద్, వెలుగు: ‘‘ అసెంబ్లీని సరిగ్గా నడపడం లేదు.. క్వశ్చన్ అవర్‌లో సమాధానం చెప్పట్లేదు.. మంత్రులను ప్రశ్నిస్తే మంత్రి సీతక్క కులం ప్రస్తావన తెస్తున్నరు.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై అడగొద్దా..’’ అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సబితా ఇంద్రా రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం తెలంగాణభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. జీరో అవర్‌ను కేవలం టైం పాస్ కోసమే నడిపిస్తున్నారని ఆరోపించారు. సాయంత్రం కాగానే ఆదరాబాదరాగా బిల్లులను పాస్ చేస్తున్నారన్నారు. అక్రమ మైనింగ్‌కు సంబంధించి పెనాల్టీ వేశామని చెబుతున్న ప్రభుత్వం.. కంపెనీపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. చర్యలు తీసుకోవడం లేదనే హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశామని తెలిపారు.
సభలో లేని వ్యక్తుల పేర్లు ప్రస్తావించొద్దని రూల్స్ ఉన్నా.. తమ నాయకుడు హరీశ్ రావు కుటుంబ సభ్యుల పేర్లు, తమ ఎంపీ పేరును ప్రస్తావించారన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే తమ గొంతు నొక్కుతున్నారని మరో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. తమను సస్పెండ్ చేసిన రోజు బ్లాక్ డే అని అన్నారు. కౌశిక్ రెడ్డి మైక్ ముందు ఏం మాట్లాడలేదని, కడియం శ్రీహరి మాట్లాడుతుంటే ఏ పార్టీ అని మాత్రమే అన్నారన్నారు. దానికి కులం రంగు పూసి తమపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని పేర్కొన్నారు.
