మా కస్టడీ నుంచే ఆదేశాలిస్తరా?

మా కస్టడీ నుంచే ఆదేశాలిస్తరా?
  • ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆర్డర్ పై ఈడీ సీరియస్ 
  •     మంత్రి ఆతిశీ ప్రకటనపై దర్యాప్తు చేస్తామని వెల్లడి 
  •     కేజ్రీవాల్ కు మద్దతుగా ఆప్ సోషల్ మీడియా క్యాంపెయిన్

న్యూఢిల్లీ :  ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తమ కస్టడీలో ఉన్న సీఎం అర్వింద్ కేజ్రీవాల్ లాకప్ నుంచే ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సీరియస్ అయింది. ఢిల్లీ ప్రజలకు తాగునీటికి ఇబ్బంది ఉండొద్దని, తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్లు తరలించాలని కేజ్రీవాల్ నుంచి ఆదేశాలు అందాయంటూ ఢిల్లీ మంత్రి ఆతిశీ ఆదివారం మీడియాకు వెల్లడించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి చీఫ్ సెక్రటరీతో పాటు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేయాలని సూచిస్తూ సీఎం లేఖ రాశారని ఆమె ఆ కాపీని మీడియాకు చూపించారు. అయితే, తమ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ కు కంప్యూటర్, ల్యాప్ టాప్, పేపర్ వంటివి ఏవీ ఇవ్వలేదని, మరి ఆయన లేఖ ఎలా రాశారంటూ ఈడీ వర్గాలు సీరియస్ అయ్యాయి. తమ కస్టడీలో ఉండగా ఆదేశాలు ఎలా జారీచేస్తారని ప్రశ్నించాయి. కోర్టు ఆదేశాలకు లోబడే ఈ ఆర్డర్ పాస్ చేశారా? లేదా? అన్నది నిర్ధారించుకుని దర్యాప్తు చేస్తామని తెలిపాయి. దీనిపై మంత్రి ఆతిశీని కూడా ప్రశ్నించనున్నట్లు తెలిపాయి. కాగా, ఈ నెల 28 వరకు కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీలోకి తీసుకుంది. రోజూ సాయంత్రం 6 నుంచి 7 మధ్య అరగంట పాటు కేజ్రీవాల్ ను ఆయన భార్య సునీత, వ్యక్తిగత సహాయకుడు మాత్రమే కలిసేందుకు అనుమతి ఇస్తున్నారు.  

ఢిల్లీ సీఎం ఫోన్ మిస్సింగ్.. 

కేజ్రీవాల్ గతంలో వాడిన ఫోన్ గురించి అడిగితే తెలియదని అంటున్నారని.. అందులో లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆధారాలు ఉన్నాయని ఈడీ అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే, కేజ్రీవాల్ ఫోన్ మిస్ అయిందంటూ ఈడీ చేసిన ప్రకటనపై ఆప్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీకి ఈడీ పొలిటికల్ పార్టీగా పనిచేస్తున్నదని ఫైర్ అయ్యారు. ఈడీ స్వతంత్ర దర్యాప్తు సంస్థ అన్న విషయాన్ని గుర్తించాలని ఢిల్లీ మంత్రి ఆతిశీ అన్నారు. ఈడీ ఏమన్నా చెప్పాలనుకుంటే కోర్టులో జడ్జి ఎదుట చార్జిషీటు ఫైల్ చేయాలని సూచించారు.  

కేజ్రీవాల్ ఫొటోను డీపీగా పెట్టుకోవాలి..   

కేజ్రీవాల్ కు మద్దతుగా ఆప్ నేతలు సోషల్ మీడియాలో ప్రచార కార్యక్రమాన్ని షురూ చేశారు. ‘కేజ్రీవాల్ ను చూసి ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారు’ అన్న క్యాప్షన్ తో ఈ క్యాంపెయిన్ మంత్రి ఆతిశీ సోమవారం ప్రారంభించారు. జైలులో ఉన్న సీఎం అర్వింద్  ఫొటోను ప్రజలు తమ వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా వేదికల్లో డిస్ ప్లే పిక్చర్ (డీపీ)గా పెట్టుకుని సంఘీభావం తెలపాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తాము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. దేశంలో మోదీని సవాలు చేయగల  లీడర్ కేజ్రీవాల్ మాత్రమేనని అన్నారు. ‘‘కేజ్రీవాల్ కు భయపడి లోక్ సభ ఎన్నికలకు ముందు ఆయనను అరెస్టు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు ఆప్ నేతల ఇండ్లలో రెండేండ్ల పాటు సోదాలు చేసినా ఒక్క రూపాయి కూడా పట్టుకోలేకపోయారు. కేజ్రీవాల్ ను మోదీ అణచివేయాలని ప్రయత్నిస్తున్నారు” అని ఆమె ఆరోపించారు. 
 
ఎలక్టోరల్ బాండ్ల స్కామ్ దేశంలోనే పెద్దది

ఎలక్టోరల్ బాండ్ల స్కామ్ దేశంలోనే అతిపెద్ద అవినీతి అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా సోమవారం కేరళలోని కన్నూరులో నిర్వహించిన ఓ ర్యాలీలో సీఎం మాట్లాడారు. ఎలక్టోరల్ బాండ్ల స్కామ్ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేజ్రీవాల్ ను అరెస్టు చేయించిందని ఆరోపించారు.