దొరకని ఆంటోని రాజులు ఎందరో.. రాజకీయాల్లో నైతిక ప్రమాణాలు పూర్తిగా క్షీణించాయి..!

దొరకని ఆంటోని రాజులు ఎందరో.. రాజకీయాల్లో   నైతిక  ప్రమాణాలు  పూర్తిగా  క్షీణించాయి..!

ఆంటోని రాజు  కేరళ రాష్ట్రంలో ఎమ్మెల్యే.  గతంలో  ఆయన కేరళ  రవాణాశాఖ మంత్రిగా కూడా  పనిచేశాడు. అనంతరం అతని ఎమ్మెల్యే  పదవిని  రద్దు చేశారు. ఎందుకంటే  కోర్టు  ఆయనకు శిక్ష  విధించింది.  గతంలో  అతను న్యాయవాది. ఆయన  న్యాయవాదిగా  పనిచేస్తున్నపుడు మాదకద్రవ్యాల కేసులో సాక్ష్యాలను తారుమారు చేశాడని రుజవైనందున అతడిని దోషిగా జ్యుడీషియల్​ ఫస్ట్​క్లాస్​ మేజిస్ట్రేట్​1  నెడుమంగడ్​ తీర్పు వెలువరించారు. ఆ కేసు 1990వ  సంవత్సరం నాటిది. 

ఆస్ట్రేలియన్​ జాతీయుడు ఆండ్రూ సాల్వటోర్​ అనే వ్యక్తి  ఓ మాదక ద్రవ్యాల కేసులో ముద్దాయి.  అతని  న్యాయవాది  ఆంటోని రాజు. ఆ కేసులో ఓ ముఖ్యమైన సాక్ష్యాన్ని రాజు తారుమారు చేశారని  ఆయనపై  ఆరోపణలు  వచ్చాయి.  1990  ఏప్రిల్​  నెలలో  తిరువనంతరపురం ఎయిర్​పోర్టులో  అతడిని  తనిఖీ  చేస్తున్నపుడు  అతని లో దుస్తులలో  మాదక ద్రవ్యాలను  దాచిపెట్టాడు.  దాంతో  పోలీసులు అతనిపై  మాదక ద్ర్యవ్యాల కేసుని  నమోదు చేశారు. 

మాదక ద్ర్యవ్యాలను,  లో దుస్తులను పోలీసులు  జప్తు చేశారు. ఆ తరువాత వాటిని కోర్టులో డిపాజిట్​ చేశారు. కొన్ని నెలల తరువాత సాల్వటోర్​ తన వ్యక్తిగత వస్తువులను విడుదల చేసి ఇవ్వాలని కోర్టులో దరఖాస్తు పెట్టుకున్నాడు. కోర్టు దానికి అనుమతిని ఇచ్చింది.  అయితే, లో దుస్తులు  ఇవ్వడానికి వీల్లేదు.  అది  మెటీరియల్​ ఆబ్జేక్ట్​ కూడా.  సాల్వటోర్​  వ్యక్తిగత  దుస్తులతోపాటు  లో దుస్తులను కూడా ఆ ప్రాపర్టీ  రూమ్ ​ఇన్​చార్జ్​ క్లర్క్ ఆంటోనీ రాజుకి అప్పగించినట్లు  ఆరోపణలు వచ్చాయి.  ఆ తరువాత  లో  దుస్తులను  తిరిగి  కోర్టుకి  ఇచ్చారు.  కానీ,  సాల్వటోర్​ను  దోషిగా  కోర్టు నిర్ధారించింది. 

 సాల్వటోర్​ని  ఎన్డీపీఎస్​ చట్ట ప్రకారం శిక్షను  కోర్టు విధించింది.  అది 10 సంవత్సరాలు  శిక్షను కోర్టు  విధించింది.  అతను  ఆ శిక్షకు  వ్యతిరేకంగా  కేరళ హైకోర్టులో అప్పీలును దాఖలు పరిచాడు. అక్కడ ఆసక్తికరంగా లో దుస్తుల చర్చ జరిగింది.  చివరికి  ప్రాక్టికల్​ టెస్ట్​ను నిర్వహించారు. ఆ  లో దుస్తులు సాల్వటోర్​కి  సరిపోలేదు. సైజు చిన్నగా మారిపోయింది. దీని ఫలితంగా హైకోర్టు సాల్వటోర్​ని  నిర్దోషిగా భావించి ఫిబ్రవరి 1991లో విడుదల చేసింది. 

రాజకీయాల్లో  నైతిక ప్రమాణాలు

నేటి రాజకీయాల్లో  నైతిక ప్రమాణాల గురించి ఆలోచించడం  కష్టమైన పని.  రాజకీయాల్లో   నైతిక  ప్రమాణాలు  పూర్తిగా  క్షీణించి పోయాయని ఈ కేసు  ద్వారా  మరోసారి  రుజువైంది.  అంతేకాదు,  న్యాయ ప్రక్రియ  ఎంతగా దుర్వినియోగం  అవుతుందో  కూడా  స్పష్టమవుతుంది.  ఒక  కోర్టు  క్లర్కు  కేసుని  ఏవిధంగా  మలుపు  తిప్పగలడో  అనే  విషయం  కళ్లకు  కట్టినట్టు  కనిపిస్తుంది.  

 సాధారణంగా  కోర్టు  కానిస్టేబుల్​  కేసుల భవితవ్యాన్ని నిర్ణయిస్తుంటాడు.   కానీ,  ఈ  కేసులో  కోర్టు క్లర్కు,  న్యాయవాది  కేసు భవిష్యత్తుని లిఖించారు.  ఫలితంగా  కేసులో సరైన న్యాయం జరగలేదు.   సాక్ష్యాలను  తారుమారు చేసిన ఈ కేసు నమోదై 31 సంవత్సరాలు సుదీర్ఘ కాలం జరిగింది.  ఆ తరువాత  అభియోగాలను  కోర్టు నమోదు  చేసింది.  అవి కూడా  నమోదు  చేసిన  19 సంవత్సరాల తరువాత ఈ తీర్పు వెలువడింది.  ఇది కూడా తుది తీర్పు కాదు.  ఇంకా పైన  ఎన్నో  కోర్టులు ఉన్నాయి.  ఆ తరువాత ఏం  జరుగుతుందో  ఇప్పుడే  ఏమీ  చెప్పలేం.  అయితే, ఈ  కేసులో  ఆంటోనీ  రాజు  తన  ఎమ్మెల్యే  పదవిని  పోగొట్టుకున్నాడు.  అతను  న్యాయపరిధి  నుంచి  తప్పించుకుంటున్న  క్రమంలో  రెండుసార్లు  శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు.  మంత్రిగా  కూడా పనిచేశారు. 

  పినరయి  విజయన్​ ప్రభుత్వంలో  రవాణాశాఖని  నిర్వహించాడు. అయితే,  అంతర్గత  పొత్తు ఒప్పందం కారణంగా ఆయన స్థానంలో మరొకరిని నియమించారు.  ఈ కేసులో తీవ్రమైన జాప్యం ఉంది. చివరికి ఆంటోనీ రాజు చట్టం పంజా నుంచి తప్పించుకోలేక పోయాడు.  ఆలస్యంగానైనా కోర్టులలో జరుగుతున్న తప్పిదాలు  ప్రజల దృష్టికి వచ్చాయి. కోర్టులు ఆలోచించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయాన్ని ఈ కేసు మరోసారి గుర్తి చేస్తుంది.  ఆంటోనీ రాజుకి శిక్ష పడింది.  శిక్ష పడాల్సిన  వ్యక్తి  కేసు  నుంచి  తప్పించుకుని  తన దేశానికి వెళ్లిపోయాడు. 

 ఈ తీర్పు ప్రభావం

ఇటీవల కేరళలో జరిగిన  స్థానిక  ఎన్నికల్లో  సీపీఎం  నేతృత్వంలోని ఎల్డీఎఫ్​  దెబ్బతిన్నది.  దానిమీద ఇది మరో దెబ్బ. ఇది  నైతికతకు సంబంధించిన దెబ్బ.  దీని ప్రభావం ఎంతమేరకు ఉంటుందన్న విషయంల  అసెంబ్లీ  ఎన్నికల  తరువాత  తెలుస్తుంది.  కానీ,  వివిధ  రాష్ట్రాల  పరిస్థితులను  గమనిస్తే  దీని ప్రభావం  అంతగా ఉండదని  అనిపిస్తుంది.  

దొరికినవాడు దొంగ.  దొరకని  దొంగలు  ఎందరో.  న్యాయ చట్రం  నుంచి  తప్పించుకుంటున్న  ఎంతోమంది రాజకీయ నాయకులను  ఈ ఆంటోనీ రాజు  కేసు  కొంతమేరకైనా  కలవరపెడుతుంది. ఈ కేసులో అసలు ముద్దాయిలు ముగ్గురు. మాదక ద్రవ్యాలు దొరికిన ఆస్ట్రేలియన్​ జాతీయుడు  సాల్వటోర్​ సెర్​వెల్లి,  ఆంటోనీ రాజు, కోర్టు క్లర్కు. సాల్వటోర్​ తప్పించుకున్నాడు. 

 కానీ,  వీళ్లు తప్పించుకోలేకపోయారు. ఇలాంటి వ్యక్తులు ఎవరూ తప్పించుకోకుండా  
చూడాల్సిన బాధ్యత నేర న్యాయ వ్యవస్థపై ఉంది.  సుదీర్ఘమైన  జాప్యం, శిక్షను, శిక్ష పరిధిని, దాని ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంది.   నేర న్యాయవ్యవస్థలోని  లోపాలను  సరిదిద్దాల్సిన  ఆవశ్యకతను  ఆంటోనీ రాజు  కేసు  గుర్తు చేస్తుంది.

హైకోర్టు విజిలెన్స్ సెక్షన్ విచారణ

సాల్వటోర్​ని  కేసు నుంచి  హైకోర్టు  విడుదల చేసింది.  కానీ,  ఆ  లో  దుస్తుల  విషయంలో  హైకోర్టు తన  అనుమానాన్ని  వ్యక్తపరిచింది.  చివరికి  హైకోర్టు  విజిలెన్స్  సెక్షన్​ ఈ  విషయాన్ని విచారించింది.  కోర్టు క్లర్కుతో  ఆంటోని రాజు   కుమ్మక్కై   లో  దుస్తులను  మార్చాడని  నిర్ధారణకు వచ్చారు.  ఫలితంగా   కోర్టుక్లర్కు  మీద,   ఆంటోని  రాజు మీద  క్రిమినల్​  కేసు  నమోదైంది.   వాళ్లిద్దరూ  సాల్వటోర్​ని  కేసు  నుంచి  విడుదల  చేయించడం కోసం  కుట్రపన్ని  లో  దుస్తులని  చిన్నగా మార్చి  కోర్టులో  పెట్టారని  చార్జ్​షీట్​  దాఖలు చేశారు.  చార్జ్​షీట్​ను  మేజిస్ట్రేట్​ గుర్తించారు.  అతని  కాగ్నిజెన్స్​  తీసుకున్నారు.  

 క్రిమినల్​  ప్రాసీజర్​ కోడ్​లోని  సెక్షన్​ 195 (1) ఈ కేసుకి వర్తిస్తుందని  హైకోర్టు భావించి  కేసుని  రద్దు చేసింది.  అయితే,  దర్యాప్తుని  ఈ చట్టం  నిర్దేశించిన  పద్ధతిలో  తిరిగి  మొదలుపెట్టాలని  హైకోర్టు  ఆదేశించింది.  2024వ  సంవత్సరంలో  సుప్రీంకోర్టు  హైకోర్టు  తీర్పుని  పక్కనపెట్టి   మొదటి  కేసునే  కొనసాగించాలని  మేజిస్ట్రేట్​ని  ఆదేశించింది.   

మేజిస్ట్రేట్​  కేసుని  విచారించి  ఆంటోని  రాజును  దోషిగా నిర్ధారించింది.   అతనికి  మూడు  సంవత్సరాల  శిక్షను  కోర్టు విధించింది.  అందువల్ల  ప్రజా ప్రాతినిధ్య  చట్టంలోని సెక్షన్​ 8 (3)  ప్రకారం  ఆయన ఎమ్మెల్యేగా  కొనసాగడానికి  ఆర్హత  కోల్పోయారు.   ప్రస్తుతానికి జరిగింది ఇది.  
ఆ తరువాత  హైకోర్టులో  ఏం జరుగుతుందో  తెలియదు. 

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- డా. మంగారి రాజేందర్​జిల్లా జడ్జి (రిటైర్డ్)-