ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని మూసేయండి

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని మూసేయండి

   రష్యాపై చర్యల విషయంలో యూఎన్ తీరుపై జెలెన్ స్కీ ఫైర్ 
    రష్యా దారుణాలు చూపుతూ వీడియో ప్రదర్శన
    రష్యాకు, టెర్రరిస్టులకు తేడా లేదని మండిపాటు 
    రష్యా డిప్లమాట్లను వెలేసిన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్వీడన్, డెన్మార్క్ 
    దాడులను మరింత పెంచిన రష్యన్ బలగాలు
    ముఖ్యమైన అన్ని సిటీలపైనా రాకెట్ దాడులు

కీవ్: ‘‘ఉక్రెయిన్ లో రష్యా చేస్తున్న దారుణాలు కన్పిస్తలేవా? మా దేశంలో జరుగుతున్న నరమేధం చూస్తుంటే ఐఎస్ టెర్రరిస్టులకు, రష్యాకు తేడా ఏమీ లేదనిపిస్తోంది. వెంటనే మీరు స్పందించండి. లేకపోతే భద్రతా మండలిని మూసేసుకోండి” అని యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ పై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ మండిపడ్డారు. రష్యాతో యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా మంగళవారం ఆయన భద్రతా మండలి సమావేశంలో వర్చువల్ గా మాట్లాడారు. ‘‘ఉక్రెయిన్ లోని కొంత భూభాగాన్ని ఆక్రమించుకున్న డయీష్ టెర్రరిస్టులకు, బూచా సిటీలో నరమేధానికి పాల్పడిన రష్యన్ బలగాలకు తేడా లేదు. ఇక్కడ స్వయంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మెంబర్ గా ఉన్న దేశమే దారుణాలకు పాల్పడుతోంది. ఉక్రెయిన్ లో జరుగుతున్న దారుణాల గురించి ప్రపంచం ఇంకా పూర్తి స్థాయి నిజాలు తెలుసుకోవాల్సి ఉంది” అని జెలెన్ స్కీ చెప్పారు. 

రష్యా డిప్లమాట్లపై ఈయూ దేశాల బ్యాన్ 

ఉక్రెయిన్​లో రష్యా అరాచకాలకు యూరోపియన్​ యూనియన్​(ఈయూ) దేశాలు గట్టి కౌంటర్​ ఇచ్చాయి. రష్యా డిప్లమాట్​లపై బ్యాన్​ విధించాయి. జర్మనీ 40 మంది రష్యా డిప్లమాట్​లను, ఫ్రాన్స్​ 35 మందిని, ఇటలీ 30 మందిని, డెన్మార్క్ 15 మందిని, స్వీడన్ ముగ్గురిని దేశం నుంచి బహిష్కరించాయి. ఆయా దేశాల విదేశాంగ శాఖ మంత్రులు ఈ మేరకు ప్రకటన చేశారు. అయితే, ఈ చర్యలను రష్యా ఖండించింది. తాము కూడా చర్యలు తీసుకుంటామని రష్యా మాజీ అధ్యక్షుడు, సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ దిమిత్రీ మెద్వదేవ్​ హెచ్చరించారు. వెస్టర్న్​ దేశాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్​ ఇచ్చారు. రష్యా అప్పుల చెల్లింపులపై అమెరికా ఆంక్షలను విధించింది. సావరిన్ పేమెంట్లను నిలుపుదల చేసింది. డాలర్లలో డబ్బులు చెల్లించకుండా నిషేధం విధించింది. 

బూచాలో జెలెన్​స్కీ

రష్యా మారణకాండకు పాల్పడిందని చెప్తున్న బూచా సిటీకి జెలెన్​స్కీ వెళ్లారు. ప్రజల దీనస్థితిపై చలించిపోయారు. యుద్ధం ముగింపుకు చర్చలొక్కటే దారి అని, కానీ ఇంత దారుణాలకు పాల్పడిన పుతిన్ తో చర్చించలేనన్నారు. అయితే, బూచాలో దారుణాలు అంటూ ఉక్రెయిన్ విడుదల చేసిన ఫొటోలు ఫేక్ అని రష్యా ఖండించింది. 

కొనసాగుతున్న దాడులు

ఉక్రెయిన్ లో బూచా సహా పలు నగరాల్లో రష్యా సేనల  దాడులు ఆగడంలేదు.  ముఖ్యమైన సిటీలన్నింటిపై రష్యా ఎయిర్​స్ట్రైక్స్​చేస్తోంది. చెర్కేసీ, చెర్నివిట్సీ, దినిప్రోపెట్రోవ్స్క్​, ఇవానో ఫ్రాంకోవిస్క్, ఖార్కివ్, ఖెమెల్నిట్స్కీ, కిరోవోహ్రాద్, లవివ్, మైకోలైవ్, ఒడెసా, పోల్టావా, రివ్నే, సూమీ, టెర్నోపిల్, విన్నీట్షియా, వోలిన్, జకర్​పాట్యా, జపోరిఝియా, ఝైటోమిర్ ఓబ్లాస్ట్స్, కీవ్​లపై రాకెట్​లను ప్రయోగిస్తోంది. మైకోలైవ్​ సిటీపై చేసిన రాకెట్ దాడుల్లో 11 మంది పౌరులు చనిపోగా.. 61 మంది గాయపడినట్టు ఉక్రెయిన్​ మానవ హక్కుల ప్రతినిధి ల్యూడిమ్లా డెనిసోవా చెప్పారు. రుబీన్​లో నైట్రిక్​ యాసిడ్​ ట్యాంక్​ను రష్యా బలగాలు పేల్చేశాయని లుహాన్స్​క్​ గవర్నర్​ సెర్హీయ్​ హైదాయి చెప్పారు. ప్రజలెవరూ బాంబ్​ షెల్టర్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.  

పిల్లల వీపులపై వివరాలు

రష్యా చేస్తున్న దాడులతో ఎప్పుడు చనిపోయేది తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భయం గుప్పిట్లో బతుకుతున్నారు. తాము చనిపోతే పిల్లలు ఏమైపోతారోనన్న భయంతో తల్లడిల్లిపోతున్నారు. ఒకవేళ తాము చనిపోతే తమ పిల్లలను చూసుకోవాలంటూ చిన్నారుల వీపులపై వివరాలను రాస్తున్నారు. వీపుపై వివరాలున్న ఓ చిన్నారి ఫొటోను అనాస్తాషియా లపాటీనా అనే ఓ జర్నలిస్టు ట్వీట్ చేశారు. ఫొటోను చూసిన నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తూ షేర్ చేస్తున్నారు.