చిలకలూరిపేటలో రోడ్ యాక్సిడెంట్ : తిరుపతిలోని ప్రముఖ డాక్టర్, ఆయన కుమార్తె మృతి

చిలకలూరిపేటలో రోడ్ యాక్సిడెంట్ : తిరుపతిలోని ప్రముఖ డాక్టర్, ఆయన కుమార్తె మృతి

ఏపీలోని చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి గుంటూరు వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో తిరుపతికి చెందిన డాక్టర్, అతని కుమార్తె మరణించగా.. పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. గురువారం ( సెప్టెంబర్ 25 ) తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...

గుంటూరు జిల్లా చిలకలూరిపేట రూరల్ మండలం తాతపూడి గ్రామం బైపాస్ దగ్గర చోటు చేసుకుంది ఈ దుర్ఘటన. తిరుపతి నుంచి గుంటూరుకు కారులో ఫ్యామిలీతో బయలుదేరిన డాక్టర్ కేదార వెంకట కిషోర్ కారు అదుపు తప్పి బలంగా డివైడర్ ను ఢీకొట్టడంతో మృతి చెందారు. ఈ ఘటనలో ఆయన ఏడేళ్ల కుమార్తె అశ్విత కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో డాక్టర్ భార్య సంధ్య సహా మరో ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఈ కుటుంబంతో పాటు మరో డాక్టర్ అన్నా శ్వేత కూడా ప్రయాణించినట్లు తెలుస్తోంది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కారు వేగంగా వచ్చి డివైడర్ ను ఢీకొట్టడంతో డాక్టర్, అతని కుమార్తె మృతి చెందారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ డాక్టర్ భార్య సంధ్య సహా మరో ముగ్గురు పిల్లలకు ప్రస్తుతం చిలకలూరి పేటలోని కందిమల్ల హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.