వరంగల్ సిటీ, వెలుగు: యూస్లెస్ ఫెలో.. చెప్పింది చెయ్.. అంటూ ఓ మహిళా రేడియోగ్రాఫర్ పై ఎంజీఎం ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఆర్థోపెడిక్ పోస్టుగ్రాడ్యుయేషన్ వైద్యుడు ఫైర్ అయ్యాడు. ఈ ఘటన ఆసుపత్రిలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన సోమవారం సాయంత్రం జరగగా, ఫిర్యాదు చేయాలని మహిళా రేడియోగ్రాఫర్ ప్రయత్నించినప్పటికీ అధికారులు అందుబాటులో లేరు.
దీంతో రేడియోగ్రాఫర్లతో పాటు ఆసుపత్రిలోని మహిళా, సహ ఉద్యోగులు మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్, కలెక్టర్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఆర్థోపెడిక్ విభాగానికి చెందిన కొంత మంది మెడికో లీగల్ కేసులకు సంబంధించిన రోగుల ఎక్స్ రే తీయాలని ఆర్థోపెడిక్ వైద్యుడు 92 విభాగంలోని ఎక్స్ రే యూనిట్‌కు వచ్చాడు. ఎక్స్ రే రాసిన కాగితాలపై సీఎంవో, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ సంతకం తప్పనిసరిగా ఉండాలి. పేపర్లపై సంతకం కావాలని రేడియోగ్రాఫర్ అనడంతో వివాదం చెలరేగింది.
