
- పూర్తిగా ఉనికిలోకి రాని ఎంహెచ్‌ఎస్‌ఆర్బీ
- ‘ప్రెసిడెన్షియల్ ఆర్డర్’ లెక్క తేలేదాకా నో జాబ్స్
- ఖాళీల సంఖ్య పెరగడంతో ‘కాంట్రాక్ట్’ నియామకాలు
- హడావుడిగా రిక్రూట్‌మెంట్
- మెడికల్ కాలేజీల నుంచి హెల్త్ సెంటర్ల దాకా ఇదే తీరు
హైదరాబాద్, వెలుగు: సర్కారీ దవాఖాన్లలో డాక్టర్లు, స్టాఫ్ నియామక ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం అనుమతులిచ్చినా.. సాంకేతిక కారణాలతో భర్తీ నాలుగైదు నెలలు పడుతుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఖాళీలు పెరుగుతూ ఉండటంతో హడావుడి వాక్‌ఇన్‌లు నిర్వహిస్తూ.. కాంట్రాక్ట్ నియామకాలు చేపడుతున్నారు. రెగ్యులర్ నియామకాలు ఎప్పుడు పూర్తవుతాయో తెలియక నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
నిరుద్యోగుల ఎదురుచూపులు
రాష్ట్రంలోని సర్కారీ దవాఖాన్లలో పోస్టులను ఇన్నాళ్లూ టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసిన ప్రభుత్వం.. ఇకపై తెలంగాణ మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా నియామకాలు చేపడతామని ప్రకటించింది. గతేడాది సెప్టెంబర్‌లోనే బోర్డు ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసినా.. ఆ ప్రక్రియ మాత్రం ఇటీవలే మొదలైంది. 1,466 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి ఒకట్రెండు నెలల్లోనే నియామక ప్రక్రియ ముగించాలని భావించారు. కానీ, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉండటం వల్ల భర్తీ ఆలస్యం అవుతోందని అధికారులు చెబుతున్నారు. ఏ పోస్టులు ఏ కేడర్‌లోకి వెళ్తాయన్నదానిపై ప్రస్తుతం వారు కసరత్తు చేస్తున్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా కొన్ని పోస్టులను రాష్ట్ర కేడర్‌లోకి, మరికొన్నింటిని జిల్లా, జోనల్ కేడర్‌లోకి మారుస్తున్నారు. ఉనికిలో లేని పోస్టులను పూర్తిగా తొలగిస్తున్నారు. సెక్రటేరియెట్ షిఫ్టింగ్‌తో ఈ ప్రక్రియ పూర్తవడానికే 3 నెలలు పడుతుందని, ఇది పూర్తయ్యాకే భర్తీ ప్రక్రియ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
హడావుడిగా వాక్‌ఇన్‌లు
రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వ్యవస్థ ఉండదని పలుమార్లు ప్రకటించిన ప్రభుత్వం.. ఉద్యోగాల భర్తీలో పూర్తిగా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ వైపే మొగ్గు చూపుతోంది. మెడికల్ కాలేజీల నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల వరకూ ఒప్పంద పద్ధతిలో డాక్టర్లు, సిబ్బందిని రిక్రూట్ చేసుకునేందుకు అనుమతిస్తోంది. నల్గొండ, సూర్యాపేట, సిద్ధిపేట మెడికల్ కాలేజీల్లో కాంట్రాక్ట్ పద్ధతిపైనే అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేశారు. ఎటువంటి వడపోతా లేకుండా హడావుడిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూలు చేసి ఉద్యోగాలు కట్టబెట్టారు. ప్రభుత్వ దవాఖాన్లలోనూ వాక్ ఇన్‌లు నిర్వహించి కాంట్రాక్ట్ పద్ధతిపై ఉద్యోగాలు ఇస్తున్నారు. తాజాగా, కామారెడ్డి, బాన్సువాడ ఏరియా హాస్పిటళ్లు, ఎల్లారెడ్డి, దోమకొండ, మద్నూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో డాక్టర్ల పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. ఖాళీల సంఖ్య పెరుగుతుండటంతో హడావుడిగా వాక్ ఇన్‌లు నిర్వహించి కాంట్రాక్ట్ సిబ్బందితో సరిపెడుతున్నారు.
రెండేండ్లుగా ఇదే పంచాయితీ
- రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, టీచింగ్ హాస్పిటళ్లు, మెడికల్ కాలేజీల్లో 10 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- ఇందులో 4 వేల డాక్టర్, 4 వేల నర్సు పోస్టులు, మరో 2 వేలకుపైగా ఇతర పోస్టులున్నాయి.
- 2017 నవంబర్ నుంచి 2018 జనవరి వరకూ టీఎస్‌పీఎస్సీ స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఏఎన్‌ఎం, రేడియోగ్రాఫర్, ఫిజియోథెరపిస్ట్ తదితర 4,375 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చింది.
- కాంట్రాక్ట్ సిబ్బందికి 30% (65 మార్కులు) వెయిటేజీ ఇచ్చింది. 2018 మార్చిలో రాత పరీక్షలు జరిగాయి.
- కాంట్రాక్ట్ సిబ్బందికి వెయిటేజీపై నిరుద్యోగులు కోర్టుకు వెళ్లడంతో ప్రక్రియ నిలిచిపోయింది.
- రెండేండ్లుగా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇటీవల నిరుద్యోగులు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేశారు.