మేం అడ్డా మీది కూలీల మాదిరి కనిపిస్తున్నామా..? 

మేం అడ్డా మీది కూలీల మాదిరి కనిపిస్తున్నామా..? 
  • ‘3 నెలల’ నోటిఫికేషన్‌‌పై మండిపడుతున్న డాక్టర్లు

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో 3 నెలల పాటు పనిచేసేందుకు డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు కావాలంటూ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్ పై డాక్టర్ల సంఘాలు మండిపడుతున్నాయి. తమను బదనాం చేయడానికే సర్కారు ఇలా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. కేవలం 3 నెలల కోసం తమ రెగ్యులర్ ప్రాక్టిస్‌‌ను వదులుకుని డాక్టర్లు ఎందుకొస్తారని  తెలంగాణ డాక్టర్స్‌‌ ఫెడరేషన్‌‌ ప్రతినిధి, డాక్టర్ విజయేందర్ సోమవారం ప్రశ్నించారు. ఇటీవల టిమ్స్‌‌లోనూ కాంట్రాక్ట్ బేసిస్‌‌లో అసిస్టెంట్‌‌, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రయత్నించిందని, అయితే ఎవరూ ఇంట్రెస్ట్ చూపించలేదన్నారు. అక్కడ ఖాళీలు అలాగే ఉండిపోయాయని గుర్తు చేశారు. ఖాళీల భర్తీకి ప్రయత్నించినా డాక్టర్లు రావడం లేదంటూ, తమను బదనాం చేసేందుకే సర్కార్ ఇలాంటి నోటిఫికేషన్లు ఇస్తోందంటూ మండిపడ్డారు. ఇలా 3 నెలలకు, ఆరు నెలలకు వచ్చి పనిచేయడానికి డాక్టర్లు అడ్డ మీద కూలీలు కాదన్నారు. కరోనా క్రైసిస్ మొదలై ఏడాది దాటినా.. ప్రభుత్వం దానికి అనుగుణంగా హెల్త్ కేర్ సిస్టమ్‌‌ను ప్రిపేర్ చేయలేకపోవడం దారుణమని చెప్పారు. స్పెషలిస్టు డాక్టర్లకు ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటళ్లలో రూ.2 లక్షల నుంచి 5 లక్షలు ఇస్తున్నారని. ప్రభుత్వం ఇచ్చే తక్కువ జీతానికి, అది కూడా 3 నెలల కోసం ఎవరూ రారన్న విషయం ఉన్నతాధికారులకు తెల్వదా అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు దోచి పెట్టడానికే ఔట్‌‌ సోర్సింగ్ రిక్రూట్‌‌మెంట్లు చేస్తున్నట్టుగా ఉందని హెల్త్ రిఫార్మ్స్‌‌ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేశ్ ఆరోపించారు.