హోం మంత్రి హామీతో బ్లాక్ డే నిర‌స‌న‌ల‌పై నిర్ణ‌యం మార్చుకున్న డాక్ట‌ర్లు

హోం మంత్రి హామీతో బ్లాక్ డే నిర‌స‌న‌ల‌పై నిర్ణ‌యం మార్చుకున్న డాక్ట‌ర్లు

ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హమ్మారిపై డాక్ట‌ర్లు, న‌ర్సులు, ఇత‌ర వైద్య సిబ్బంది త‌మ ప్రాణాల‌ను సైతం లెక్క చేయ‌కుండా పోరాడుతున్నారు. ఇంటికి కూడా వెళ్ల‌కుండా రాత్రింబ‌వ‌ళ్లు ఆస్ప‌త్రుల్లోనే ఉండి సేవ చేస్తున్నారు. క‌రోనా బాధితుల ప్రాణాల‌ను నిల‌బెట్ట‌డానికి ఫ్రంట్ లైన్ లో నిల‌బ‌డి ఆ ప్రాణాంత‌క వైర‌స్ ను త‌రిమికొట్టేందుకు శ్ర‌మిస్తున్నారు. నిస్వార్థంగా వారు చేస్తున్న సేవ‌ల‌కు యావ‌త్ మాన‌వాళి రుణ‌ప‌డిపోయిన వేళ.. కొంద‌రు రాక్షసంగా దాడుల‌కు దిగుతున్నారు.

ఆస్ప‌త్రుల్లో చికిత్స అందిస్తున్న స‌మ‌యంలో పేషెంట్లే తిర‌గ‌బడి కొడుతున్నారు. వైద్య సిబ్బందితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఇండోర్ స‌హా ప‌లు ప్రాంతాల్లో ల‌క్ష‌ణాలు ఉన్న‌వారిని గుర్తించి ఆస్ప‌త్రికి త‌ర‌లించేందుకు వెళ్లిన డాక్ట‌ర్ల‌పై రాళ్ల‌తో దాడి చేశారు. మ‌రికొన్ని చోట్ల అద్దె ఇళ్ల‌లో ఉంటున్న డాక్ట‌ర్ల‌ను ఖాళీ చేయాల‌ని, ఫ్రూట్స్ కొనుక్కోడానికి మార్కెట్ కు వెళ్లిన డాక్ట‌ర్ల‌ను వైర‌స్ వ్యాప్తి చేస్తున్నారంటూ హింస‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న‌లు అనేకంగా జ‌రిగాయి. ఈ దాడుల‌ను ఖండిస్తూ దేశ వ్యాప్తంగా భార‌త మెడిక‌ల్ అసోసియేష‌న్ (ఐఎంఏ) ఆధ్వ‌ర్యంలో డాక్ట‌ర్లు నిర‌స‌న‌కు సిద్ధ‌మ‌య్యారు. త‌మ ప్రాణాల‌ను రిస్కులో పెట్టి వైద్య సేవ‌లు అందిస్తున్న స‌మ‌యంలో ఇలాంటి దాడులు జ‌ర‌గ‌డం ఘోర‌మ‌ని, త‌మ రక్ష‌ణ‌పై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోకుంటే ఏప్రిల్ 22న వైట్ అల‌ర్ట్ ప్రొటెస్ట్, ఏప్రిల్ 23న‌ బ్లాక్ డే పాటించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ప్ర‌క‌టించింది ఐఎంఏ. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఐఎంఏ ప్ర‌తినిధుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడి హామీ ఇవ్వడంతో ఆ నిర‌స‌న‌ల‌ను ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు డాక్ట‌ర్లు.

మీ భద్ర‌త.. మా బాధ్య‌త‌

ఐఎంఏ డాక్ట‌ర్ల ప్ర‌తినిధుల‌తో బుధ‌వారం ఉద‌యం కేంద్ర మంత్రులు అమిత్ షా, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశ‌మ‌య్యారు. వైద్య సిబ్బంది భ‌ద్ర‌త త‌మ ప్ర‌భుత్వ బాధ్య‌త అని హామీ ఇచ్చారు. నిర‌స‌న‌లను విర‌మించుకోవాల‌ని కోరారు. డాక్ట‌ర్లు అందిస్తున్న సేవ‌ల‌ను అభినందించిన హోం మంత్రి అమిత్ షా.. దేశ‌మంతా క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాడుతున్న స‌మ‌యంలో ఆందోళ‌న‌ల‌కు దిగితే త‌ప్పుడు మెసేజ్ వెళ్తుంద‌ని అన్నారు. సింబాల‌క్ ప్రొటెస్ట్ కూడా చేయొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. డాక్ట‌ర్ల సేఫ్టీతో పాటు వారి గౌర‌వాన్ని కాపాడాల్సిన బాధ్య‌త మోడీ ప్ర‌భుత్వం తీసుకుంటుంద‌ని హామీ ఇచ్చారు. ఇటువంటి దాడులు జ‌ర‌గ‌కుండా ర‌క్ష‌ణ క‌ల్పిస్తామ‌ని చెప్పారు. అలాగే దాడుల‌కు పాల్ప‌డిన వారిపై నాన్ బెయిల‌బుల్ కేసులు పెట్టి, క‌ఠిన చర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

దేశ‌మంతా ఐక్యంగా పోరాడాలి: ఐఎంఏ

డాక్ట‌ర్ల నిర‌స‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంటున్నామ‌ని ఈ స‌మావేశం త‌ర్వాత ఐఎంఏ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. నేరుగా కేంద్ర హోం మంత్రి నుంచి వ‌చ్చిన భ‌రోసాను దృష్టిలో పెట్టుకుని రెండ్రోజుల నిర‌స‌న‌ల‌ను ఆపేస్తున్నామ‌ని తెలిపింది. క‌రోనా క్రైసిస్ ను దేశ‌మంతా స‌మైక్యంగా పోరాడాల‌న్న ఉద్దేశంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని వెల్ల‌డించింది.