సర్కారు దవాఖాన్లో పనిచేసేందుకు ఇష్టపడని డాక్టర్లు

సర్కారు దవాఖాన్లో పనిచేసేందుకు ఇష్టపడని డాక్టర్లు

హైదరాబాద్‌, వెలుగురాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసేందుకు డాక్టర్లు ముందుకు రావడం లేదు. గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు, పీడియాట్రిషన్లు వంటి స్పెషలిస్టులైతే అసలు సర్కారు దవాఖానాల దిక్కు చూడటం లేదు. జీతాలు పెంచి ఇస్తామన్నా స్పందించడం లేదు. ఒకటి రెండు చోట్ల కాదు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, స్పెషలిస్టులు లేక జనం గోస పడుతున్నరు. రెగ్యులర్​ జీతాలు తక్కువగా ఉండటం, పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా డాక్టర్లు లేక పని ఒత్తిడి పెరిగిపోవడం, అదనపు డ్యూటీలు చేయాల్సి రావడం, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి ఇష్టపడకపోవడం వంటివి డాక్టర్లు ముందుకు రాకపోవడానికి కారణంగా చెప్తున్నారు. ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేసి, జీతాలు పెంచితే ఈ సమస్య చాలా వరకు తీరిపోతుందని, కానీ ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపడం లేదని వైద్యారోగ్య శాఖ వర్గాలు అంటున్నాయి.

నోటిఫికేషన్​ ఇచ్చినా..

ఇటీవల సిరిసిల్ల జిల్లా హాస్పిటల్లో రెండు గైనకాలజీ డాక్టర్​ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ ఇచ్చారు. నెలకు రూ.లక్షన్నర జీతం ఇస్తామని ప్రకటించారు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. చివరికి వేరే గవర్నమెంట్​ హాస్పిటళ్లలో పనిచేస్తున్న నలుగురు గైనకాలజిస్టులు, ఓ పీడియాట్రీషన్‌ను డిప్యుటేషన్‌పై సిరిసిల్ల హాస్పిటల్​కు పంపించారు. కామారెడ్డి ఏరియా హాస్పిటల్లో పని చేసేందుకు నలుగురు పీడియాట్రిషన్లు కావాలని ఈ నెల 16న నోటిఫికేషన్‌  ఇచ్చారు. ఒక్కరూ దరఖాస్తు చేసుకోని పరిస్థితి ఉంది. బాన్సువాడ ఏహెచ్‌, కామారెడ్డి ఏహెచ్‌, ఎల్లారెడ్డి, దోమకొండ, మద్నూర్‌‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో పనిచేయడానికి 15 మంది ఎంబీబీఎస్‌ డాక్టర్లు కావాలని నోటిఫికేషన్‌ ఇస్తే.. 13 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఏజెన్సీ ఏరియాల్లో అయితే మరీ దారుణం. మిగతా ప్రాంతాల్లో కంటే ఎక్కువ జీతం ఇస్తామన్నా అక్కడ పని చేయడానికి డాక్టర్లు ముందుకొస్తలేరు.

వచ్చినా మానేస్తున్నరు

సర్కారు‌ దవాఖాన్లలో అన్ని విభాగాల్లో కలిపి 10 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో ఐదు వేల వరకు డాక్టర్‌‌  పోస్టులున్నాయి. చెకప్‌లు, ప్రసవాల కోసం సర్కారు‌ దవాఖాన్లకు వచ్చే గర్భిణుల సంఖ్య ఈ మూడేండ్లలో బాగా పెరిగింది. కానీ డాక్టర్ల సంఖ్య పెరగ లేదు. పేషెంట్లు గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి. చివరికి ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరిగి కాంట్రాక్టు రిక్రూట్‌మెంట్లు మొదలుపెట్టారు. జిల్లా కలెక్టర్ల ఆదేశాలతో కాంట్రాక్టు విధానంలో నియామకాలు చేపడుతున్నారు. రెగ్యులర్‌‌  డాక్టర్ల ప్రారంభ వేతనం కంటే రెండున్నర రెట్లు ఎక్కువగా.. ఏజెన్సీ ప్రాంతాల్లో నెలకు రూ.2 లక్షలు, మిగతా ప్రాంతాల్లో రూ.1.5 లక్షల చొప్పున జీతం ఇస్తున్నారు. అయినా ఎవరూ ముందుకు రాకపోవడం, వచ్చినా పని ఒత్తిడి తట్టుకోలేక కొద్ది నెలలకే ఉద్యోగం వదిలేసి వెళ్లిపోవడం సాధారణంగా మారింది.

ప్రైవేటు డాక్టర్లకు పైసలిచ్చి..

ప్రస్తుతం 60% వరకు ప్రసవాలు ప్రభుత్వ దవాఖాన్లలోనే జరుగుతున్నాయి. కానీ గైనకాలజిస్టుల కొరత కారణంగా ప్రసవాలు చేసేందుకు ప్రైవేటు డాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. వాళ్లకు ఒక్కో ప్రసవానికి రూ.2,500 నుంచి రూ. 3,000 వరకు చెల్లిస్తున్నారు. వారు ప్రసవం చేసి వెళ్లిపోతారు. డెలివరీ తర్వాతి ట్రీట్​మెంట్, బాధ్యతలతో వారికి సంబంధం ఉండదని ఓ ఆస్పత్రి సూపరింటెండెంట్  తెలిపారు. స్పెషలిస్టుల కొరతతో ఐసీయూ, ఎస్ఎన్‌సీయూ(స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్‌)లలోనూ ఎంబీబీఎస్‌ డాక్టర్లతోనే నెట్టుకొస్తున్నారు.

తక్కువ ఇస్తున్నరు.. జీతాలు పెంచాలె..

స్పెషలిస్టులకు, ఎంబీబీఎస్‌ డాక్టర్లకు దాదాపు సమాన వేతనం ఇస్తున్నారు. జనరల్ డ్యూటీలు, ఎంఎల్‌సీ వర్క్‌, పోస్ట్‌మార్టం డ్యూటీలు చేయిస్తున్నారు. ప్రైవేటు హాస్పిటళ్లలో ఇచ్చే వేతనాల కంటే చాలా తక్కువ వేతనాలు ఇస్తున్నారు. 15 ఏండ్ల సర్వీస్‌ ఉన్న డాక్టర్లకు కూడా గ్రాస్‌ సాలరీ రూ.లక్ష దాటడం లేదు. రోగుల సంఖ్యకు అనుగుణంగా డాక్టర్లు లేకపోవడంతో పని ఒత్తిడి ఎక్కువవుతోంది. సర్కారు‌ దవాఖానాల్లో పనిచేసేందుకు యువ డాక్టర్లు ఇష్టపడట్లేదు. ఈ పరిస్థితులన్నీ మారాలి. వేతనాలు పెంచాలి. స్పెషలిస్టులకు రూ.15 వేలు అదనంగా అలవెన్స్‌ ఇవ్వాలి. ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలి. రిక్రూట్‌మెంట్‌ సమయంలో రెండు మూడు సార్లు కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్​లు ఇవ్వాలి.

– డాక్టర్‌‌ శ్రీనివాస్‌, పీడియాట్రీషియన్‌, గవర్నమెంట్ డాక్టర్స్‌ అసోసియేషన్‌ వైస్ ప్రెసిడెంట్‌

కారణాలెన్నో..!

డాక్టర్లు ముందుకు రాకపోవడానికి చాలా కారణాలున్నాయి. సర్కార్‌‌ దవాఖాన్లలో కనీస సదుపాయాలు ఉండకపోవడం, డాక్టర్ల సంఖ్య తక్కువగా ఉండి పని భారం ఎక్కువగా ఉండడం, ఒత్తిడి కారణంగా ఇటువైపు వచ్చేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు. పైగా నైట్ డ్యూటీలు, పోస్ట్‌ మార్టమ్‌ డ్యూటీలు వేస్తున్నారు. గైనిక్, పీడియాట్రిక్, రేడియాలజీ స్పెషలిస్టులకు బయట డిమాండ్‌  ఎక్కువ. ప్రైవేటు హాస్పిటళ్లలో వేతనాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మరోవైపు పదేండ్ల సర్వీస్ ఉన్న తమకంటే.. ఇప్పుడు కాంట్రాక్టు వారికి ఎక్కువ జీతం ఇస్తున్నారని రెగ్యులర్ డాక్టర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు జీతాలు పెంచాలని డిమాండ్​ చేస్తున్నారు.