నిలకడగా పంత్ ఆరోగ్యం

నిలకడగా పంత్ ఆరోగ్యం

కారు ప్రమాదంలో గాయ పడిన టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు ప్రకటించారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం రిషబ్.. డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.  ఇప్పటికే అతనికి అన్ని పరీక్షలు నిర్వహించారు.  ప్రాథమిక రిపోర్టులో  రిషబ్ పంత్ కు ఐదు చోట్ల గాయాలు అయినట్లు డాక్టర్లు గుర్తించారు. గాయాలను స్కాన్ చేయంతో పాటు..మెదడు, వెన్నెముకకు MRI స్కానింగ్ తీసినట్లు చెప్పారు. స్కానింగ్ రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని డాక్టర్లు ప్రకటించారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 

కారు ప్రమాదంలో రిషబ్ పంత్ మోకాలు, మణికట్టుకు గాయమైంది. వెన్నుభాగంలోనూ గాయం అయింది.  తల దగ్గర రెండు చోట్ల గాయపడ్డాడు.  గాయం తీవ్రతను తెలుసుకునేందుకు ఎంఆర్‌ఐ పరీక్ష చేశారు. శనివారం చీలమండ, మోకాలికి MRI స్కాన్ చేయబడుతుందని డాక్టర్లు తెలిపారు. అయితే నొప్పి ఎక్కువ కావడంతో స్కానింగ్ శనివారానికి వాయిదా పడిందన్నారు. పంత్ మోకాలి, చీలమండపై గాయం తీవ్రంగా ఉందని.. నొప్పి, వాపు  వల్ల  ఎంఆర్‌ఐని శనివారానికి వాయిదా వేశారు. స్కానింగ్  రిపోర్టులు వచ్చిన తర్వాత గాయం తీవ్రత ఏంటో తెలుస్తుందని డాక్టర్లు తెలిపారు. రిపోర్టు ఆధారంగా  తదుపరి చికిత్స కోసం రిఫర్ చేస్తామన్నారు. రిపోర్టులు  వచ్చిన తర్వాత రిషబ్‌ను ఢిల్లీకి రెఫర్ చేయడంపై నిర్ణయం తీసుకుంటారని డాక్టర్లు వెల్లడించారు. 

మరోవైపు రిషబ్ పంత్ కుటుంబానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం అండగా నిలిచింది. పంత్ కారు ప్రమాదానికి గురైన తర్వాత ఉత్తరాఖండ్  ప్రభుత్వ పెద్దలు అతని తల్లితో మాట్లాడారు. రిషబ్ పంత్ చికిత్సకు సంబంధించి ఆందోళన చెందొద్దని అండగా నిలిచారు.  పంత్ చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు.