సర్కారు దవాఖానలో ఫేస్​ సర్జరీ

సర్కారు దవాఖానలో ఫేస్​ సర్జరీ
  • అడవిదున్న దాడిలో గాయపడిన రైతు
  • ట్రీట్​మెంట్​ అందించి కాపాడిన డాక్టర్లు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: అడవి దున్న దాడిలో ఛిద్రమైన పశువుల కాపరి ముఖానికి కొత్తగూడెం గవర్నమెంట్​డాక్టర్ల టీమ్​ సర్జరీ చేసి కాపాడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రేగులగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ సమ్మయ్య పశువులను కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలానే గత నెల 26న రేగులగూడెం సమీపంలోని అటవీ ప్రాంతంలో పశువులను మేతకు తీసుకెళ్లాడు. అడవి దున్న దాడి చేయడంతో సమ్మయ్య ముఖం ఛిద్రమైంది. కుటుంబసభ్యులు వెంటనే కొత్తగూడెంలోని జిల్లా గవర్నమెంట్​ హాస్పిటల్​కు తరలించారు. డాక్టర్​ రవిబాబు ఆధ్వర్యంలో డాక్టర్లు​విజయ్​కుమార్, నవీన్​బృందం సమ్మయ్యపై స్పెషల్​ కేర్​తీసుకుని ట్రీట్​మెంట్​అందించారు. బతుకుతాడో లేడో అనుకున్న సమ్మయ్యకు వారి వద్ద ఉన్న పరికరాలతో సర్జరీ చేశారు. దాదాపు రెండు వారాలపాటు డాక్టర్లు దగ్గరుండి పర్యవేక్షించారు. సమ్మయ్యకు పూర్వ ముఖాకృతి వచ్చేలా చేశారు. శుక్రవారం అతడిని డిశ్చార్జ్​ చేశారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ డాక్టర్లకు తన జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. అరుదైన సర్జరీ చేసిన డాక్టర్​ రవిబాబు, డాక్టర్ల టీమ్​ను గవర్నమెంట్ ​హాస్పిటల్స్​ కో ఆర్డినేటర్​ ముక్కంటేశ్వరరావు, హాస్పిటల్​ సూపరింటెండెంట్​డాక్టర్​ సరళ అభినందించారు.