యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మంగళవారం నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభం అయ్యాయి. సాయంత్రం ప్రధానాలయంలో ద్రవిడ ప్రబంధ సేవాకాలంలో నిర్వహించిన తొళక్కం పూజలతో అధ్యయనోత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం స్వామివారికి మత్స్యావతార సేవ జరిపారు. స్వామివారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఈ అధ్యయనోత్సవాలు ఆరు రోజుల పాటు జరగనున్నాయి.
అధ్యయనోత్సవాల నేపథ్యంలో జనవరి 4 వరకు స్వామి వారికి ప్రతిరోజూ జరిపే సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు, జోడు సేవలు, ఆర్జిత నిజాభిషేకం, సహస్రనామార్చన సేవలను నిలిపివేశారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా రెండో రోజైన బుధవారం ఉదయం వేణుగోపాలస్వామి అలంకార సేవ.. సాయంత్రం గోవర్ధనగిరిధారి అలంకార సేవ నిర్వహించనున్నారు.
