యువతికి త్రీడీ ప్రింటింగ్ చెవి అమర్చిన డాక్టర్లు

యువతికి త్రీడీ ప్రింటింగ్ చెవి అమర్చిన డాక్టర్లు
  • లివింగ్​ సెల్స్​ ఆధారంగా చెవి రూపకల్పన
  • అమెరికాలో క్లినికల్​ ట్రయల్స్
  • మైక్రోషియాతో బాధపడే వారికి ప్రయోజనం

న్యూయార్క్: అమెరికా డాక్టర్లు అరుదైన ఆపరేషన్​ చేశారు. ఓ యువతికి త్రీడీ ప్రింటెడ్​ చెవిని ట్రాన్స్​ప్లాంటేషన్​ ద్వారా విజయవంతంగా అమర్చారు. ఆ యువతి లివింగ్​ సెల్స్​ నే ఉపయోగించి ఈ చెవికి డాక్టర్లు రూపకల్పన చేశారు. ఇలా చెవిని ట్రాన్స్​ ప్లాంట్​ చేయించుకున్న తొలి వ్యక్తి ఈమే కావడం గమనార్హం. త్రీడీ బయో థెరప్యూటిక్స్  అనే రిజనరేటివ్​ మెడిసిన్​ కంపెనీ తొలిసారిగా ఈ క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహించింది. మెక్సికోకు చెందిన అలెక్సా(20)కి పుట్టుకతోనే కుడి చెవి చిన్నగా.. సరైన ఆకృతి లేకుండా ఉండేది. దీనినే మైక్రోషియా అని కూడా అంటారు. ఆ యువతి లివింగ్​ సెల్స్​ ఆధారంగా పేషెంట్​కు సంబంధించిన త్రీడీ ప్రిటింగ్​ చెవిని ఈ సంస్థ రూపొందించింది. ఇది విజయవంతం కావడంతో మైక్రోషియాతో బాధపడే మరింత మంది రోగులకు ఈ టెక్నాలజీని ఉపయోగించి కొత్త జీవితం ఇవ్వొచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. మైక్రోషియా అంటే పుట్టుకతోనే ఒకటి లేదా రెండు చెవులు లేకపోవడం లేదా చెవి సరిగ్గా రూపుదిద్దుకోకపోవడం. అయితే ఈ త్రీడీ  ప్రింటింగ్​ చెవి సహజమైనదిలాగే ఉంటుందని, స్పర్శ అనుభూతి కలుగుతుందని త్రీడీ  బయో థెరప్యూటిక్స్ వివరించింది. టెక్సాస్ రాష్ట్రం శాన్​ ఆంటోనియోలోని మైక్రోషియా–కంజెనిటల్​ ఇయర్ డిఫర్మిటీ ఇనిస్టిట్యూట్​కు చెందిన ఇయర్​ రియర్​ రికనస్ట్రక్టివ్​ సర్జన్​ డాక్టర్​ ఆర్టురో బోనిల్లా ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను పూర్తి చేసినట్టు ఆ సంస్థ వెల్లడించింది. మైక్రోషియా రోగుల బయటి చెవిని కోసం ఆరినోవో అనే పద్ధతిని ఉపయోగించి ఇయర్​ ఇంప్లాంట్​ చేసినట్టు తెలిపింది. ‘‘ఒక ఫిజిషియన్​గా నేను ఎంతో మంది మైక్రోషియా పేషెంట్లకు ట్రీట్ మెంట్​ చేశాను. ఈ టెక్నాలజీ మైక్రోషియా పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులకు ఎంత కీలకమో నాకు తెలుసు. అందుకే ఈ టెక్నాలజీ నన్ను ఇన్​స్పైర్​ చేసింది. రోగి సొంత కార్టిలేజ్​ కణాలను ఉపయోగించిన ఈ కొత్త విధానం ఎంత సురక్షితం అనే దానిని తెలుసుకోవడానికి ఈ స్టడీ మాకు ఉపయోగపడుతుంది. ఇది మైక్రోషియా పేషెంట్లలో ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుతుంది”అని డాక్టర్ ఆర్టురో బోనిల్లా చెప్పారు. కాగా, ఇది చరిత్రాత్మకమైన ఘట్టమని, ఈ క్లీనికల్​ ట్రయల్స్​ మైక్రోషియాతో బాధపడేవారికే కాకుండా ఇతరులకు ఉపయోగపడాయని తాను భావిస్తున్నానని త్రీడీ  బయో చీఫ్​ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ డేనియల్ కోమెన్​ చెప్పారు.