మాయిశ్చరైజర్​ ఎక్కువ వాడొద్దు

మాయిశ్చరైజర్​ ఎక్కువ వాడొద్దు

డ్రై, ఆయిలీ, నార్మల్​.. స్కిన్​ టైప్​ ఏదైనా సరే మాయిశ్చరైజర్​ కంపల్సరీ. చలికాలంలో అయితే ఇది తప్పనిసరి​. కానీ, కాలమేదైనా పదేపదే మాయిశ్చరైజర్​ రాస్తే చిక్కులు తప్పవు. మోతాదుకి మించి మాయిశ్చరైజర్​ వాడితే చర్మాన్ని డేంజర్ జోన్​లోకి నెట్టినట్టే. ఇదే విషయాన్ని ‘ఈస్తటిక్ క్లినిక్’​ కాస్మొటిక్​ డెర్మటాలజిస్ట్​, సర్జన్​ రింకీ కపూర్​ కూడా చెబుతోంది. మాయిశ్చరైజర్​​ ఎక్కువగా వాడితే చర్మంపై పగుళ్లు, బ్లాక్​ హెడ్స్​​, గడ్డలు వస్తాయి. అలాగే చర్మ కణాలు మూసుకుపోయి చర్మం మరింత డ్రై అవుతుంది అంటున్నారామె. ఈ సమస్యకి సొల్యూషన్​ ఏంటంటే..

చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలని మాయిశ్చరైజర్​ రాయడం మంచిదే. కానీ, అది మోతాదు మించితే.. చర్మంపై పేరుకుపోతుంది. దుమ్ము ధూళిని అబ్జార్బ్​ చేసుకుంటుంది. దాంతో చర్మానికి సరిపడా గాలి అందదు. దానివల్ల చర్మం డల్​గా, డ్రైగా మారిపోతుంది. సెబేషియస్​​ గ్రంథుల నుంచి సీబమ్​ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల చర్మం నేచురల్​గానే మాయిశ్చరైజ్​ అవుతుంది. దుమ్ము,  ధూళి, ఎండ నుంచి తనని తాను కాపాడుకుంటుంది. కానీ,  ఎక్కువగా మాయిశ్చరైజర్స్​ రాయడం వల్ల  సీబమ్​ ప్రొడక్షన్​ తగ్గిపోతుంది. దానివల్ల చర్మానికి సరిపడా న్యూట్రియెంట్స్ అందక కొత్త సమస్యలు వస్తాయి. 

ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న  మాయిశ్చరైజర్స్​ అన్నీ  పారాబిన్స్​,  ఆస్ట్రిజెంట్స్​, ప్రొపైలిన్​ గ్లైకాల్, మినరల్​ ఆయిల్​, ట్రైఎథనోలమైన్​, హైడాంటోయిన్​తో పాటు రకరకాల ఫ్రాగ్నెన్స్​లతో నిండినవే. పైగా పెట్రోలియం బేస్డ్ ప్రొడక్ట్స్​ కూడా ఎక్కువే. వీటివల్ల చర్మంపై అలర్జీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. క్యాన్సర్స్​కి దారితీస్తాయి ఇవి. ఇమ్యూనిటీ సిస్టమ్​ని దెబ్బతీసి మరెన్నో చర్మ సమస్యల్ని తీసుకొస్తాయి. అందుకే కెమికల్స్​తో నిండిన ఈ మాయిశ్చరైజర్స్​​కి బదులు నేచురల్​ ఇంగ్రెడియెంట్స్ ఉండే వీగన్​, ఆర్గానిక్​ మాయిశ్చరైజర్స్​ వాడటం మంచిది. ఎక్కువగా మాయిశ్చరైజర్​ రాస్తే చర్మ కణాలు మూసుకుపోతాయి. దీనివల్ల  బ్లాక్​ హెడ్స్​, వైట్ హెడ్స్​తో పాటు యాక్నె సమస్యలు వస్తాయి. చర్మం ఎర్రబడుతుంది. దద్దుర్లు వస్తాయి. అందుకే  వంటింట్లో దొరికే పదార్థాలతోనే చర్మాన్ని మాయిశ్చ రైజ్​ చేసుకోవాలని చెబుతోంది రింకీ కపూర్​. 

వంటింటి​ మాయిశ్చరైజర్స్​​

తేనె, కొబ్బరి నూనె, ఆలివ్​, ఆల్మండ్ ఆయిల్స్, పెరుగు, కీరదోస, ఓట్స్​, సన్​ ఫ్లవర్​,  క్యారెట్​ జ్యూస్, అలొవెరాలని నేచురల్​ మాయిశ్చరైజర్స్​గా వాడొచ్చు. వీటిల్లో విటమిన్–ఎ, ఈ , కె, డి  లాంటి మాయిశ్చరైజింగ్ విటమిన్స్​తో పాటు యాంటీ ఆక్సిడైజింగ్, యాంటీ ఏజింగ్​ ప్రాపర్టీలు ఉంటాయి. వీటివల్ల కాలమేదైనా చర్మం మెరుస్తుంది. ఇవి అన్ని రకాల స్కిన్ టైప్స్​ వాళ్లకి సూట్​ అవుతాయి కూడా. ఇవేమీ వద్దనుకుంటే చర్మాన్ని శుభ్రంగా కడుక్కుని, డెడ్​ స్కిన్​ సెల్స్​ని తీసేయాలి. ఆ తర్వాత కొంచెం మాయిశ్చరైజర్​ తీసుకుని చర్మాన్ని మసాజ్​ చేయాలి.  కావాలంటే ఈ ఆరెంజ్​ ఫేస్​ ప్యాక్​​ కూడా ట్రై చేయొచ్చు. 

కావాల్సినవి

ఆరెంజ్​​– మూడు 
పెరుగు – ఒక  టేబుల్​ స్పూన్​
తేనె – ఒక టేబుల్​ స్పూన్​

తయారీ

ఆరెంజ్​ తొక్కలని  శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేయాలి. ఆ ముక్కలని  ఎండబెట్టి,  మెత్తగా పొడి​ చేయాలి. రెండు టేబుల్​ స్పూన్ల పౌడర్​లో పెరుగు, తేనె కలిపి పేస్ట్​లా చేయాలి. దాన్ని ముఖానికి పట్టించి ఇరవై  నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడగాలి.