డాక్టర్లపై ‘ప్రసవ’ భారం

డాక్టర్లపై ‘ప్రసవ’ భారం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: పని భారంతో సర్కారు హాస్పిటల్స్‌‌‌‌లో గైనకాలజిస్టులు సతమతమవుతున్నారు. ఒత్తిడి తట్టుకోలేక కొందరు ఉద్యోగానికే గుడ్‌ బై చెబుతున్నారు. ఇటీవల కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు డాక్టర్లు ఉద్యోగం మానేయడానికి కారణం పని ఒత్తిడేనని తెలిసింది . ప్రస్తు తం అక్కడ ఇద్దరు గైనకాలజిస్టులు పనిచేస్తుండగా అందులో ఒకరు పనిఒత్తిడి తట్టుకోలేక వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. సగటున ఆ ఆస్పత్రిలో రోజుకు 12 నుంచి 15 డెలివరీలు అవుతున్నాయి. రాష్ట్రంలో సగం ఏరియా, జిల్లా హాస్పిటల్స్‌‌‌‌, బోధనాస్పత్రుల్లో ఇదే పరిస్థితి ఉంది. కేసీఆర్‌‌‌‌ కిట్‌ తర్వాత సర్కారు ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య రెండిం తలైంది. 55% ప్రసవాలు గవర్నమెంట్ హాస్పిటల్స్‌‌‌‌లోనే జరుగుతున్నాయి. దీంతో గైనకాలజిస్ట్‌‌‌‌లపై పని భారం పెరిగింది.

ఒక్కో డాక్టర్‌‌‌‌‌‌‌‌ రోజుకు 10–15 డెలివరీలు చేస్తున్నారు. దీనికితోడు నలుగురైదుగురు డాక్టర్లు పనిచేయాల్సిన చోట ఒకరిద్దరి తోనే నెట్టుకొస్తున్నారు. కాంట్రాక్టుపై గైనకాలజిస్టులను తీసుకోవాలనుకున్న ప్రభుత్వం రూ.లక్ష, లక్షన్నర జీతమిస్తామని ప్రకటించినా ఎవరూ ముందుకు రావడంలేదు. జాయిన్‌ అయినా రెండు, మూడు నెలలు చేసి వెళ్లిపోతున్నారు.

నార్మల్‌‌‌‌ డెలివరీలకు ఒత్తిడి

పని భారంతోపాటు నార్మల్‌‌‌‌ డెలివరీల టార్గెట్‌ గైనకాలజిస్టులకు ఇబ్బందిగా మారింది. సర్కారు ఆస్పత్రుల్లో సిజేరియన్ల శాతం 60 దాటింది. దీంతో నార్మల్‌‌‌‌ డెలివరీల శాతం పెంచాలని వారిపై అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. సిజేరియన్లు అధికంగా జరుగుతున్న 12 జిల్లా ల డాక్టర్లను పిలిపించి మాట్లాడారు. డాక్టర్ల కొరత తీర్చకుండా నార్మల్‌‌‌‌ డెలివరీల కోసం ఒత్తిడి పెంచడంపై వైద్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తొలుసూరి ప్రసవాల్లో 70% నార్మల్‌‌‌‌ డెలివరీలే కావాలని టార్గెట్ పెట్టినట్టు డాక్టర్లు చెబుతున్నారు.

అలవెన్స్‌‌‌‌లూ ఇస్తలేరు

డాక్టర్లకు డెలివరీ అలవెన్స్‌‌‌‌లు ఇస్తామని ఏడాది క్రితం ఇచ్చిన హామీ కూడా ఇంకా అమల్లోకి రాలేదు. ఇటీవల ఆరోగ్యశాఖ మంత్రి ఈటల నిర్వహించిన సమావేశంలోనూ ఈ అంశం చర్చకొచ్చింది. నార్మల్‌‌‌‌ డెలివరీల కోసం అధికార్లు ఒత్తిడి తెస్తున్నా రని డాకర్లు మంత్రికి ఫిర్యాదు చేశారు.

ఇలాగే కొనసాగితే కష్టం

డెలివరీల సంఖ్య పెరిగినా పనిచేయడానికి డాక్టర్లు సిద్ధంగానే ఉన్నారు. కానీ ఉన్న వాళ్లపైనే ఒత్తిడి పెరుగుతోంది . ఒక్కరిద్దరు గైనకాలజిస్టులే ఉన్నచోట ఏ సమయంలో కేసు వచ్చినా వారే అటెంప్ట్‌‌‌‌ చేయాల్సి వస్తోంది . ఇలాగే కొనసాగితే పనిచేయడం కష్టం . వెంటనే డాక్టర్లను నియమించాలి.

 డాక్టర్‌‌‌‌ ఎం.శ్రీనివాస్‌‌‌‌, వైస్‌‌‌‌ ప్రెసిడెంట్‌ , గవర్నమెంట్‌ డాక్టర్ల సంఘం