PHCలను వెంటాడనున్న  డాక్టర్ల కొరత ..పీజీ కోర్సులకు వెళ్లనున్న సగంమంది డాక్టర్లు

PHCలను వెంటాడనున్న  డాక్టర్ల కొరత ..పీజీ కోర్సులకు వెళ్లనున్న సగంమంది డాక్టర్లు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని పీహెచ్​సీలలో డాక్టర్ల కొరత రానుంది. సగానికి సగం మంది డాక్టర్లు ఉన్నత చదువుల కోసం వెళ్లేందుకు సిద్ధమయ్యారు.  జిల్లాలోని 65 మంది డాక్టర్లకు 32 మంది ఈ నెలాఖరులో పీజీకి వెళ్తున్నారు.  ప్రోగ్రాం ఆఫీసర్లు పోనూ మిగిలేది  28 మంది డాక్టర్లు మాత్రమే. జిల్లాలోని 24 గంటల పీహెచ్​సీలకు స్టాఫ్​ నర్సులు, వైద్య సిబ్బందే దిక్కు కానున్నారు. ఏజెన్సీలో ఈ ఎండాకాలం,  వచ్చే వానాకాలంలో వ్యాధులు పెరిగే ప్రమాదం ఉంది. 

 జిల్లాలో 34 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్​సీలు) ఉన్నాయి. ఇందులో 24 పీహెచ్​సీలు 24 గంటల హాస్పటల్స్​.  ప్రతి పీహెచ్​సీకి ఇద్దరు డాక్టర్లు ఉండాలి.  24 గంటల పీహెచ్​సీలకు ఇద్దరు నుంచి ముగ్గురు డాక్టర్లు కావాలి.  ఈ జిల్లాలో అత్యధికంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో  మారుమూల అటవీ గ్రామాలు ఎక్కువ. ఇప్పటికే ఇక్కడి ప్రజలకు వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో సగం మంది డాక్టర్లు పీజీ చదివేందుకు వెళ్తుండడంతో ఏజెన్సీలో వైద్య సమస్యలు రానున్నాయి.  

 ప్రస్తుతం ఉన్న 65 మందిలో ఐదుగురు డాక్టర్లు ప్రోగ్రాం ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 60 మందిలో  32 మంది పీజీకి వెళ్తుండడంతో 28 మంది డాక్టర్లు మాత్రమే ఉంటారు. గుండాల, ఆళ్లపల్లి, ఎంపీ బంజర, రొంపేడ్​, కొమరారంతో పాటు పలు పీహెచ్​సీలలో  డాక్టర్ల కొరత రానుంది.  కొత్త డాక్టర్లు వచ్చేంత వరకు స్టాఫ్​ నర్సులు, వైద్యసిబ్బందే రోగులకు ట్రీట్​మెంట్​ ఇవ్వనున్నారు.

 అసలే డాక్టర్ల కొరతతో అల్లాడే పీహెచ్​సీలకు ఉన్న డాక్టర్లలో ఒకరిద్దరు లీవ్​ పెడితే  స్టాఫ్​ నర్సులే రోగులకు దిక్కుగా మారనున్నారు. మరో వైపు 24 గంటల హాస్పటల్స్​లో రోగులకు వైద్య సేవలు తూతూ మంత్రంగానే అందే అవకాశాలున్నాయి. పీహెచ్​సీలలో డాక్టర్లు లేకపోతే ఏజెన్సీ వాసులు ఆర్​ఎంపీల బాట పట్టే అవకాశాలున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.

కాంట్రాక్ట్​  డాక్టర్ల నియామకాలకు చర్యలు 

ఉన్న డాక్టర్లలో సగం మంది డాక్టర్లు పీజీ చదువుల కోసం వెళ్తుండడంతో వారి స్థానంలో కాంట్రాక్ట్​ పద్దతిలో డాక్టర్లను తీసుకునేందుకు కలెక్టర్​తో పాటు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు త్వరిత గతిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎండా కాలంతో పాటు వచ్చే వానాకాలంలో ఏజెన్సీ ప్రాంతం అధికంగా ఉన్న ఈ జిల్లాలో వ్యాధులు పెద్ద ఎత్తున ప్రబలే అవకాశం ఉంది. వానా కాలంలో గోదావరి వరదలు వైద్య ఆరోగ్యశాఖకు ప్రతి ఏడాది సవాల్​గా మారుతున్నాయి. ఈ క్రమంలో డాక్టర్లు లేకపోతే ఏజెన్సీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలుంటాయి. 

లేఖ రాశాం..

పలువురు డాక్టర్లు పీజీకి వెళ్తున్న క్రమంలో వారి స్థానాల్లో కాంట్రాక్ట్​   డాక్టర్ల నియామకాల కోసం ఉన్నతాధికారులకు లేఖ రాశాం. వారి నుంచి ఆదేశాలు రాగానే కలెక్టర్​ సూచనలతో డాక్టర్ల నియామకాలకు నోటిఫికేషన్​ ఇస్తాం. వెళ్లిన వాళ్లు పోగా ఉన్న వాళ్లతో మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తాము. 

-  తుకారాం రాథోడ్​, డీఎంహెచ్​ఓ, భద్రాద్రికొత్తగూడెం -