డాక్యుమెంట్ - 2047తోనైనా గవర్నమెంట్ స్కూల్స్ మారాలి..!

డాక్యుమెంట్ - 2047తోనైనా గవర్నమెంట్ స్కూల్స్ మారాలి..!

గురుకుల పాఠశాలలు అద్భుతమైన ఫలితాలను సాధించడానికి ముఖ్య కారణం, వాటికి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా  లభించే మౌలిక సదుపాయాలే.  అయితే, సాధారణ  ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ప్రమాణాలు లేకపోవడం ప్రధాన సమస్య.

 మౌలిక వసతులు, సిబ్బంది కొరత

అనేక ప్రభుత్వ పాఠశాలల్లో  లైబ్రేరియన్ లేకపోవడం వల్ల పుస్తకాల నిర్వహణ, విద్యార్థులకు పఠనా ఆసక్తిని పెంచడం,  గ్రంథాలయ వనరులను సమర్థవంతంగా వినియోగించడం సాధ్యం కావడం లేదు.  ఒక లైబ్రేరియన్ కేవలం పుస్తకాలను రికార్డు చేసే వ్యక్తి కాదు, పఠన సంస్కృతికి నాంది పలికే కీలక విద్యావేత్త.  ప్రభుత్వ పాఠశాలల్లో  పీఈటీ  పోస్టులు నింపకపోవడం లేదా వాటిని ఇతర బోధనా బాధ్యతలకు ఉపయోగించడం జరుగుతోంది.  యోగా టీచర్ల నియామకంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదు.  ఆర్ట్ అండ్​ సంగీతానికి మద్దతు లేదు.  

ఆర్ట్ టీచర్,  మ్యూజిక్  టీచర్ లేకపోవడం వలన విద్యార్థుల సృజనాత్మకత, భావోద్వేగ అభివృద్ధికి సంబంధించిన కీలకమైన అంశాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.  ప్రభుత్వ విద్య బలహీనపడటానికి ప్రధానంగా ఉపాధ్యాయులతోపాటు సహాయక సిబ్బందిని నియమించకపోవడం కూడా ఒక ప్రధాన కారణం.  గురుకులాల్లో వసతి గృహాల వార్డెన్‌లు,  ల్యాబ్ అసిస్టెంట్‌లు, లైబ్రేరియన్‌లు వంటి అనేక ఇతర సిబ్బంది ఉంటారు.  కానీ, సాధారణ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులే బోధనతోపాటు ఇతర పరిపాలన, నిర్వహణ బాధ్యతలను మోయాల్సి వస్తుంది.

బోధనా పద్ధతిలో మార్పు లేకపోవడం 

ప్రైవేట్ పాఠశాలలు ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, ఎక్స్​పీరియెన్షియల్ లెర్నింగ్ వంటి ఆధునిక పద్ధతులను అమలు చేస్తుంటే,  అనేక ప్రభుత్వ పాఠశాలలు ఇంకా బట్టీ పద్ధతి, మార్కుల ఆధారిత విద్యకే పరిమితం అవుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు, సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు.  ప్రభుత్వ పాఠశాల విద్య అంటే 'పేద పిల్లల చదువు' అనే అభిప్రాయం సమాజంలో బలంగా నాటుకుపోయింది.  

ప్రభుత్వ పాఠశాలల్లో ఎంత నాణ్యమైన విద్య ఉన్నా, ఈ ప్రతికూల దృష్టికోణం వలన మధ్యతరగతి తల్లిదండ్రులు కూడా ప్రైవేట్ విద్య వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ప్రతికూల దృష్టికోణాన్ని మార్చాలంటే  ప్రభుత్వం ఉన్నత ప్రమాణాలను సాధారణ పాఠశాలల్లో చూపించాలి.  దీనికి తెలంగాణ రైజింగ్​–2047 డాక్యుమెంట్​లో పరిష్కారం చూపాలి.

డిజిటల్, స్మార్ట్ తరగతులు

తెలంగాణ  ప్రభుత్వం చేపట్టిన  బడిబాట కార్యక్రమం ఒక మంచి ప్రారంభం.  దీనిని మరింత పటిష్టం చేస్తూ  ప్రతి ప్రభుత్వ పాఠశాల ఈ కింది ప్రమాణాలను సాధించాలి.   అన్ని తరగతులను ఇంటరాక్టివ్ స్మార్ట్ బోర్డులతో డిజిటల్ తరగతులుగా మార్చాలి.  ప్రతి పాఠశాలలో అత్యాధునిక సైన్స్, గణితం, కంప్యూటర్ ల్యాబ్‌లు ఉండాలి. క్రీడా వసతులు,  కళా కేంద్రాలు: పిల్లల సర్వతోముఖాభివృద్ధికి తగిన క్రీడా మైదానాలు, పరికరాలు, ఆర్ట్, మ్యూజిక్ కోసం ప్రత్యేక కళా కేంద్రాలను  ఏర్పాటు చేయాలి.  

గురుకులాల మాదిరిగా మరుగుదొడ్ల శుభ్రత, తాగునీటి సౌకర్యం,  మొత్తం ప్రాంగణం పరిశుభ్రతను నిరంతరం పర్యవేక్షించాలి.  ప్రభుత్వ విద్యారంగం కేవలం ప్రభుత్వ యంత్రాంగంపైనే  ఆధారపడకుండా, స్థానిక నాయకత్వం,  సమాజం భాగస్వామ్యం అవసరం. 

నిరంతర ఉన్నత స్థాయి సమీక్ష

ముఖ్యమంత్రి నిధుల వినియోగం, నియామకాల పురోగతి,  మౌలిక వసతుల కల్పనపై సమీక్ష జరపాలి. ముఖ్యమంత్రి  స్వయంగా ప్రభుత్వ పాఠశాలలను ఆపుడపుడైనా ఆకస్మికంగా సందర్శించాలి.  విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో నేరుగా మాట్లాడటం ద్వారా అసలు సమస్యలను, విజయాలను తెలుసుకోవాలి. 

ఇది సిబ్బందిలో జవాబుదారీతనాన్ని పెంచుతుంది.  ప్రజల్లో ప్రభుత్వ విద్యపై నమ్మకాన్ని పెంచుతుంది.   నెలకు ఒకసారి ముఖ్యమంత్రి  'విద్యారంగంపై విద్యార్థులు/తల్లిదండ్రులతో ఫోన్-ఇన్ కార్యక్రమం' ఏర్పాటు చేయడం అనేది ఒక విప్లవాత్మక చర్య అవుతుంది.

తెలంగాణ రైజింగ్ 2047.. విద్యతోనే వికాసం

తెలంగాణ రాష్ట్రం 2047 నాటికి అభివృద్ధి చెందిన అగ్రగామి రాష్ట్రంగా నిలవాలంటే అది కేవలం పారిశ్రామికాభివృద్ధి,  ఐటీ రంగంపై మాత్రమే ఆధారపడదు. మానవ వనరుల నాణ్యతపై ఆధారపడుతుంది. ఈ నాణ్యతను పెంచేది ప్రభుత్వ విద్యారంగమే.  ప్రభుత్వ పాఠశాలల సమస్యలు తీరిస్తే సాధారణ ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ సంస్థలకు దీటుగా నిలబడతాయనేందుకు నిదర్శనం గురుకులాలు.  

ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి,  స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ సంస్కరణలను ఒక ఉద్యమంగా స్వీకరించాలి.  ప్రత్యేకంగా లైబ్రేరియన్లు, ఆర్ట్ టీచర్లు,  మ్యూజిక్ టీచర్లు వంటి కీలక సిబ్బంది నియామకానికి, అలాగే కళలు, క్రీడలు వంటి సహ-పాఠ్య కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.  ప్రభుత్వ విద్యారంగం బాగుపడితేనే  మన పిల్లల భవిష్యత్తు మార్పు చెందుతుంది అనే  మాటలో ఉన్న సత్యాన్ని గుర్తించాలి.  రాష్ట్ర నాయకత్వం దీర్ఘకాలిక ప్రణాళికతో,  బలమైన రాజకీయ సంకల్పంతో ఈ సంస్కరణలను చేపడితే ప్రభుత్వ పాఠశాలలు తిరిగి సామాజిక సమానత్వానికి,  నాణ్యమైన విద్యకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తాయి. 

- షేక్​ రహీమ్​