ఈ వేసవిలో చల్లవి తాగితే చల్లగుంటదా?

ఈ వేసవిలో చల్లవి తాగితే చల్లగుంటదా?

ఎండాకాలం వచ్చిందంటే చాలామందికి కొత్త సందేహాలు వస్తాయి. ఇంట్లో కిటికీలు తెరిచి ఉంచాలని కొందరంటే..  మూసి ఉంచాలని ఇంకొందరంటారు. వేడి పానీయాలు తాగకూడదని కొందరంటే.. తాగొచ్చు అని మరికొందరంటారు.  ఇలా వేసవిలో  బోలెడు సందేహాలు వస్తుంటాయి.  అయితే వాటిల్లో  ఏవి నిజాలో,  ఏవి అపోహలో తెలుసుకుందాం..

వేసవిలో ఇంటి కిటికీలు తీసి ఉంచాలా, వేసి ఉంచాలా అనే సందేహం చాలామందికి ఉంటుంది.  బయట  గాలి వేడిగా ఉంటుంది కాబట్టి  కిటికీలు ఎప్పుడూ మూసేసి ఉంచుతారు చాలా మంది.  అయితే నిజానికి   వేసవిలో పగటి పూట ఇంట్లో ఉండే ఉక్కను నివారించాలంటే ఎంతో కొంత గాలి గదిలోకి రావాలి. అందుకే వేసవిలో కిటికీలు కాస్త తెరిచి పెట్టుకోవాలి. అలాగే   సాయంత్రం వాతావరణం చల్లబడ్డాక పూర్తిగా తెరవాలి.

హాట్ డ్రింక్స్ తాగొచ్చా?

ఎండతాపం నుంచి తప్పించుకోడానికి ద్రవ పదార్థాలు తీసుకోవాలని అందరూ చెప్తారు. కానీ శీతల పానీయాలు, వేడి పానీయాల్లో  ఏదిమంచిదనే సందేహం చాలామందికి ఉంటుంది .  టీ, కాఫీ వంటి వేడి పానీయాలు తీసుకుంటే వాటివల్ల శరీర ఉష్ణోగ్రత మరింత పెరుగుతుందని.. అందుకే వేడిగా ఉండే పానీయాలకు వేసవిలో దూరంగాఉండాలని,  శీతల పానీయాలు మాత్రమే తీసుకోవాలంటారు.

కానీ నిజానికి వేడిగా ఉండే పానీయాలే శరీరాన్ని తొందరగా చల్లబరుస్తాయని, మరీ చల్లని పానీయాలు మరింత వేడిని కలిగిస్తాయని కొన్ని సర్వేల్లో తేలింది.  వేడి పానీయాలు తాగినప్పుడు  చెమటలు పట్టి శరీరం చల్లబడేందుకు వీలుంటుంది.  అయితే, ఆర్థ్రత ఎక్కువగా ఉన్న వేళల్లో వేడి పానీయాలు తాగడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు.

ఫ్యాన్‌ మంచిదేనా?

అలాగే వేసవిలో ప్రతీ ఒక్కళ్లు  ఇంట్లో ఫ్యాన్‌ వేసుకుని దాని కింద కూర్చుంటుంటారు.  కానీ  37 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఫ్యాన్లు పెద్దగా ఉపయోగకరం కాదని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మాత్రమే ఫ్యాన్లు ప్రభావవంతంగా పనిచేస్తాయట. ఒక్కోసారి బయట ఉష్ణోగ్రత బాగా ఎక్కువగా ఉండి, గాలి కూడా వేడెక్కిపోతే అలాంటి సమయంలో ఫ్యాన్‌ వేయడం వల్ల మరింత నష్టం కలుగుతుందని చెప్తున్నారు. గాలి వేడెక్కినప్పుడు ఫ్యాన్ వేస్తే ఆ వేడి గాలి శరీరానికి తాకి డీహైడ్రేషన్‌కు దారితీస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.

బీరు చలవేనా?

ఇకపోతే కొంతమంది వేసవిలో వేడి నుంచి తప్పించుకోవడానికి చల్లని బీరు తాగాలని వాదిస్తుంటారు.  అలాగే, బీరు తాగడం వల్ల శరీరానికి చల్లదనం కలగదని మరికొందరు వాదిస్తారు.  ఈ విషయం గురించి స్పెయిన్ పరిశోధకులు ఓ అధ్యయనం చేశారు. ట్రెడ్‌మిల్‌పై 40 నిమిషాల పాటు ఎక్సర్‌సైజ్ చేసి బాగా చెమటలు పట్టిన తరువాత ఒక బీరు ఇచ్చి వాళ్ల శరీరంలోని నీటి శాతాన్ని పరీక్షించారు. అయితే వాళ్లలో అంతగా నీటిశాతం పెరగలేదు.  శరీరానికి తగినంత నీటిని అందించడంలో బీరు కంటే  సాధారణ నీళ్లు, స్పోర్ట్స్ డ్రింక్‌లు మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయని ఆ అధ్యయనంలో తేలింది.