
కోరుట్ల(మెట్పల్లి), వెలుగు: జగిత్యాల జిల్లా మెట్ పల్లి టౌన్ బోయవాడలో శుక్రవారం పిచ్చికుక్క దాడిలో చిన్నారులు మహిళా గాయపడ్డారు. స్కూల్‌కు వెళ్తున్న ఆరుగురు విద్యార్థులపైన, మరో పాపతో పాటు మహిళపైన ఒక్కసారిగా దాడికి దిగి మొత్తం 8 మందిని కరిచింది. స్థానికులు వెంటనే బాధితులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుక్క కాటుకు చికిత్స చేసినట్లు, ప్రస్తుతం బాధితులకు ఎలాంటి హానీ లేదని డాక్టర్ సాజిద్ తెలిపారు.
ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని కోరారు. టౌన్ లోని13, 14 వార్డులకు చెందిన బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు మున్సిపల్ కమిషనర్ మోహన్‌కు వినతి పత్రం అందించారు. వెంటనే కుక్కలను పట్టుకొని, ప్రజలను కాపాడాలని పేర్కొన్నారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ.. త్వరలోనే వీధి కుక్కల బెడద నుంచి రక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు.