హిమాచల్లోని సియాతి గ్రామాన్ని అర్ధరాత్రి ముంచెత్తిన వరదలు.. ఊరును కాపాడిన కుక్క

హిమాచల్లోని సియాతి గ్రామాన్ని అర్ధరాత్రి ముంచెత్తిన వరదలు.. ఊరును కాపాడిన కుక్క
  • వరద ముప్పు నుంచి యజమానితో పాటు 67 మందిని కాపాడిన పెంపుడు శునకం

మండి: కుండపోత వర్షాలతో హిమాచల్​ ప్రదేశ్​లోని ఓ గ్రామాన్ని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. అర్ధరాత్రి వరద వచ్చిపడడంతో పాటు కొండచరియలు విరిగిపడడంతో గ్రామంలోని ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. ఊరు మొత్తానికీ నాలుగైదు ఇండ్లు మాత్రమే మిగిలాయి. ఈ స్థాయిలో విధ్వంసం జరిగినా కూడా గ్రామంలోని 67 మంది ప్రాణాలతో బయటపడ్డారు. దానికి కారణం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పెంపుడు శునకమే.. వరద ముంచెత్తడానికి కాసేపటికి ముందు తన అరుపులతో యజమానిని అప్రమత్తం చేసింది.దీంతో యజమాని కుటుంబంతో పాటు ఊరోళ్లు కూడా సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లి ప్రాణాలు దక్కించుకున్నారు. హిమాచల్​ ప్రదేశ్​ లోని మండి జిల్లా సియాతీ గ్రామంలో గత నెల 30 న చోటుచేసుకుందీ ఘటన.

అర్ధరాత్రి కుక్క అరుపులు..
జూన్ 30 అర్ధరాత్రి 12– 1 గంట మధ్య తమ పెంపుడు శునకం అదేపనిగా మొరుగుతుండడంతో నిద్రలేచానని సియాతీ గ్రామస్థుడు నరేంద్ర తెలిపాడు. రెండో అంతస్తులో ఉన్న కుక్క దగ్గరికి వెళ్లగా.. అప్పటికే గోడకు భారీ పగుళ్లు ఏర్పడి వరద నీరు లోపలికి రావడం కనిపించిందన్నాడు. దీంతో వెంటనే కుక్కను తీసుకుని మిగతా కుటుంబ సభ్యులతో పాటు బయటకు వెళ్లిపోయానని చెప్పాడు. ఓవైపు కుండపోతగా వర్షం కురుస్తుండడంతో గ్రామంలోని మిగతా వాళ్లను నిద్రలేపినట్లు నరేంద్ర వివరించాడు. ఆ తర్వాత అందరం కలిసి పక్క గ్రామంలో అధికారులు ఏర్పాటు చేసిన క్యాంప్ కు వెళ్లిపోయామని తెలిపాడు. ఆ తర్వాత కాసేపటికే ఊరును వరద ముంచెత్తిందని, కళ్ల ముందే ఇండ్లన్నీ కూలిపోయాయని వివరించాడు.

అర్ధరాత్రి పూట తన కుక్క అరవకపోయుంటే తామంతా నిద్రలోనే చనిపోయేవాళ్లమని చెప్పుకొచ్చాడు. వరదలు, కొండచరియలు విరిగిపడడంతో గ్రామం మొత్తం శిథిలాల దిబ్బగా మారిందని, ఇప్పుడు నాలుగైదు ఇండ్లు మాత్రమే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశాడు. అర్ధరాత్రి ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెట్టడంతో ఎక్కడి వస్తువులు అక్కడే వదిలివేశామని చెప్పాడు. ప్రస్తుతం తామంతా కట్టుబట్టలతో మిగిలామని నరేంద్ర వివరించాడు. కాగా, సియాతీ గ్రామస్థులకు తక్షణ సాయం కింద కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించామని, గ్రామస్థులందరికీ షెల్టర్ ఏర్పాటు చేశామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.