బాలుడిపై వీధి కుక్క దాడి.. ఆస్పత్రికి తరలింపు

బాలుడిపై వీధి కుక్క దాడి.. ఆస్పత్రికి తరలింపు

గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మనుషులు కనిపిస్తే చాలు ఎక్కడ పడితే అక్కడ కండలు పీకేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై కుక్కల దాడులు ఎక్కువైపోయాయి. కుక్కల స్వైర విహారంతో ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే జనం జంకుతున్నారు.  వీధి కుక్కల దాడిలో ఇదివరకే నగరంతో పాటు రాష్ట్రంలోని పలుచోట్ల చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సూరారం డివిజన్  శ్రీరామ్ నగర్ కాలనీలో వీధి కుక్క ఓ బాలుడిపై దాడి చేసి, తీవ్రంగా గాయపర్చింది. ఈ ఘటనలో గాయపడ్డ బాలుడిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడికి చికత్స అందిస్తున్నారు డాక్టర్లు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. 

ఇదిలా ఉంటే చిన్న పిల్లలు టార్గెట్‌గా కుక్కల దాడులు ఏమాత్రం తగ్గడం లేదు. వేసవి కాలం ఎండలు తీవ్రత కారణంగానే వీధి కుక్కలు ఇలా ప్రవరిస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే కుక్కలు ఇలా చిన్నారులపై దాడులు చేస్తున్నా... వాటి నియంత్రణకు అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.