ఆర్నెళ్ల గరిష్టానికి బంగారం ధరలు డాలర్ బలహీనతే కారణం

ఆర్నెళ్ల గరిష్టానికి బంగారం ధరలు డాలర్ బలహీనతే కారణం

న్యూఢిల్లీ: అమెరికా డాలర్‌‌‌‌ బలహీనపడటంతో సోమవారం బంగారం ధరలు ఆరు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్  ఊహించిన దానికంటే త్వరగా వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే ఆశతోనూ ధరలు పెరిగాయి.  ఉదయం స్పాట్ మార్కెట్‌లో  ఔన్సు (28.34 గ్రాములు) బంగారం 0.6 శాతం పెరిగి 2,012.92 డాలర్ల (దాదాపు రూ.1,67,768) వద్దకు చేరింది. ఈ ఏడాది మే 16న అత్యధికంగా 2,017.82 డాలర్లను టచ్ చేసింది. యూఎస్​ గోల్డ్ ఫ్యూచర్స్ 0.5శాతం లాభపడి ఔన్సుకు 2,013.80 డాలర్ల వద్ద ఉంది. ప్రధాన కరెన్సీల బాస్కెట్‌‌‌‌తో పోల్చితే యూఎస్​ డాలర్ 0.1శాతం పడిపోయింది. నవంబర్‌‌‌‌లో యూఎస్​ డాలర్ ఇండెక్స్ 3.16శాతం పడిపోయింది.

పెట్టుబడిదారులు బుధవారం విడుదల చేయనున్న  యూఎస్​ మూడవ క్వార్టర్​ జీడీపీ లెక్కల కోసం ఎదురు చూస్తున్నారు. డిసెంబరులో దాని తదుపరి  ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్​ఓఎంసీ) సమావేశంలో యూఎస్​ ఫెడ్ రేట్లను మార్చకుండా ఉంటుందని భావిస్తున్నారు. స్పాట్ వెండి ఔన్సుకు 1.4శాతం పెరిగి 24.65 డాలర్ల వద్దకు, ప్లాటినం 0.2శాతం పెరిగి 932.81 డాలర్ల వద్దకు చేరుకుంది. పల్లాడియం 0.6శాతం పెరిగి ఔన్సుకు 1,075.01 డాలర్ల వద్ద ఉంది.  డిసెంబర్ డెలివరీకి బంగారం ఔన్సుకు 10.20 డాలర్లు పెరిగి 2,003 డాలర్లకు చేరుకుంది. 

డిసెంబర్ డెలివరీ వెండి ఔన్స్‌‌‌‌కు 65 సెంట్లు పెరిగి 24.34 డాలర్లుగా ఉంది. వారం తర్వాత కీలకమైన యూఎస్​ యూరోపియన్ ఇన్​ఫ్లేషన్​ డేటాపై పెట్టుబడిదారులు దృష్టి సారిస్తుండటంతో సోమవారం గ్లోబల్ స్టాక్ మార్కెట్లు దాదాపు ఫ్లాట్‌‌‌‌గా ఉన్నాయి. ప్రపంచ స్టాక్స్ ఎంఎస్​సీఐ ఇండెక్స్ 0.06శాతం తగ్గింది. పాన్- యూరోపియన్ స్టాక్స్​600 ఇండెక్స్ 0.13శాతం దిగువన ఉంది. ఎస్​ అండ్ ​పీ 500 ఇండెక్స్‌‌‌‌లో ఫ్యూచర్స్ 0.18శాతం తగ్గాయి. ప్రధాన ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం కూడా తగ్గాయి.